ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులు పరిశీలించిన అధికార బృందం

Must read

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి గాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకిలాద్రీ కొండపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరా స్వామి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను శనివారం సాయంత్రం అధికార బృందం సమగ్రంగా పరిశీలించింది. భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ పనుల పురోగతిని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు.

మొదటగా దేవస్థానం ఈవో కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బెంగుళూరుకు చెందిన (NIRM) నిపుణుల బృందం, School of Planning and Architecture Vijayawada అధికారులు, దేవస్థానం ఈవో సీనా నాయక్​, మాస్టర్ ప్లాన్ అమలు ప్రధాన సలహాదారు కొండల్​ రావు, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీర్ శేఖర్​, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కేటేశ్వరరావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలు పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రసాదం పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ప్రసాదం పోటు నిర్మాణం, అన్నప్రసాద భవనం పూర్తి పనులపై అధికారులు వివరణాత్మకంగా చర్చించారు.

అనంతరం అధికారులు ఘాట్ రోడ్‌ను పరిశీలించి, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండ ప్రాంతం కావడంతో రాళ్లు జారిపడే ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఇంద్రకీలాద్రిపై రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులను అభివృద్ధి చేయడం అత్యవసరమని అధికారులు అభిప్రాయపడ్డారు. పార్కింగ్, తాగునీటి సదుపాయం, శౌచాలయాలు, విశ్రాంతి కేంద్రాలు వంటి అంశాల్లో కూడా మెరుగుదల కోసం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఇంజనీరింగ్ నిపుణుడు కొండలరావు బృందం ఆలయాన్ని సందర్శించి శ్రీ అమ్మవారిని దర్శించుకుంది. ఆలయ సంప్రదాయాల ప్రకారం దేవస్థానం ఈవో శీనా నాయక్ వారు వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా భక్తులకు సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించడమే కాకుండా, ఆలయ ప్రాంగణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మాస్టర్ ప్లాన్ అమలు పూర్తయిన తరువాత ఇంద్రకీలాద్రి దేశంలోనే అత్యుత్తమ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అవతరించనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!