గత ప్రభుత్వం విధ్వంస పాలన నుండి రెండేళ్లలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టరల్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు.
సూపర్ సిక్సకు మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రెవెన్యూ వ్యవస్థలోనూ ఈ రెండేళ్లలో సమూల సంస్కరణలు తెచ్చామన్నారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి అస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కెవైసీ సదుపాయం కల్పించామన్నారు.
పట్టా భూముల 1బి, అడంగల్ ను అన్లైన్లో భూ యజమానులే స్వంతంగా లాక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. భూయజమానుల అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యుటేషన్లు గానీ, రిజిస్ట్రేషన్లు గానీ చేసే అవకాశం ఉండదన్నారు. కొత్త పాస్ బుక్ కూడా ఈకేవైసీ చేసి డ్రాఫ్ట్ పాస్ పుస్తకాన్ని రైతులకు చూపించి వారు సంతృప్తి చెందిన తర్వాతే ముద్రణకు పంపిస్తున్నామన్నారు.
పేదలకు అసైన్ చేసిన ఇళ్ల పట్టాలకు గతంలో పదేళ్ల తర్వాత సర్వ హక్కులు కల్పిస్తే కూటమి ప్రభుత్వం రెండేళ్ల తర్వాత సర్వ హక్కులు కల్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని వల్ల బడుగు కుటుంబాలకు ఆర్ధిక భరోసా దోరుకుతుందన్నారు.
వారం రోజుల పాటు సాగిన సింగపూర్ పర్యటనలో పాలనకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గతంలో ఎన్నో సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పటికీ ఈ పర్యటన మాత్రం చాలా ప్రత్యేకమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో భారీ వ్యవస్థ ఉండగా సింగపూర్ తన పనులను చాలా ఖచ్చితంగా, సమన్వయంతో చేయడంలో మేటి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తనకున్న విస్తృతమైన వ్యవస్థను, సింగపూర్ లాంటి ఖచ్చితత్వంతో కలిపి ముందుకు తీసుకెళ్లాలన్నారు.
ఏపీలో ప్రభుత్వ శాఖలు, జిల్లా పరిపాలన పటష్టంగా ఉన్నప్పటికీ సింగపూర్ లాగా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేసేలా చూసుకోవాలన్నారు. ఇప్పటికే ఏపీ దేశంలో ఉత్తమ విధానాలను అనుసరిస్తూ ఉండగా సింగపూర్ విధానాలను కూడా మేళవింపు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మారుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.





