కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెంనర్లకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింద.ఇ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల కరవు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచేందుకు ఆమోదం లభించింది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు,భత్యాలు పెరగనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రకటించాల్సిన ఈ డీఏ సవరణ ఈ ఏడాది ఆలస్యంగా వెలువడింది. అయినప్పటికీ తాజా నిర్ణయంతో ఉద్యోగ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
డీఏ పెంపు లెక్కింపు వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) ఆధారంగా గత 12 నెలల సగటు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని జరుగుతుంది. తాజా 2 శాతం పెంపుతో మొత్తం డీఏ స్థాయి 60 శాతానికి చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
డీఏ సవరణలు ఒక నిర్దిష్ట ఫార్ములా ప్రకారం క్రమం తప్పకుండా జరుగుతాయి. ఈ నేపథ్యంలో అధిల్ శెట్టి మాట్లాడుతూ, 2016లో కేవలం 2 శాతంగా ఉన్న డీఏ, దశాబ్ద కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తూ ఇప్పుడు సుమారు 60 శాతానికి చేరిందని వివరించారు.
ఈ డీఏ పెంపు తాత్కాలిక ఉపశమనంగా భావించబడుతున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు మాత్రం దీని కంటే పెద్ద సంస్కరణలపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా 8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు చేయాలని వారు బలంగా డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు, పెన్షన్లు, సేవా నిబంధనలను సమగ్రంగా సవరించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ మేరకు నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఏప్రిల్ 14న ప్రభుత్వానికి సమర్పించిన మెమొరాండంలో తమ డిమాండ్లను స్పష్టంగా పేర్కొంది. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో వేతన సవరణ అత్యవసరమని వారు సూచించారు.
ఈ డీఏ పెంపు నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారంగా వేతన సంఘం ఏర్పాటు అవసరమని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నారు.





