వివాదాస్పద డేరా సచ్చా సౌదా (DSS) అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు హరియాణా ప్రభుత్వం మరోసారి పెరోల్ మంజూరు చేసింది. అత్యాచార కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు ఈసారి 30 రోజుల పెరోల్ ఇవ్వడంతో మంగళవారం ఉదయం రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి భారీ పోలీసు భద్రత మధ్య విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ రహీమ్‌ను ఈ ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో జైలు బ్యారక్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ స్థాయిలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయన ప్రత్యేక పోలీసు కాన్వాయ్ మధ్య సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు.
సిర్సా జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి లభించిన తర్వాతే ఆయనకు అక్కడ నివాసం ఉండేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే పెరోల్ కాలంలో కొన్ని కఠిన నిబంధనలు కూడా విధించారు. ముఖ్యంగా ఆయన తన అనుచరులు, భక్తులను పెద్ద సంఖ్యలో ఒకచోట సమీకరించకూడదని స్పష్టం చేశారు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కూడా అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.
అయితే వర్చువల్ లేదా ఆన్‌లైన్ ద్వారా తన అనుచరులతో మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా పెరోల్ సమయంలో ఆయన ఆన్‌లైన్ ద్వారా భక్తులతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
జైలు నిబంధనల ప్రకారం ఒక ఖైదీకి క్యాలెండర్ ఏడాదిలో 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లో పొందే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికే జనవరిలో రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్ లభించింది. ఇప్పుడు తాజాగా మరో 30 రోజుల పెరోల్ మంజూరు కావడంతో ఆయన తన వార్షిక పెరోల్ కోటాను పూర్తిగా వినియోగించుకున్నట్లయింది. ఈ పెరోల్ ముగిసిన తర్వాత ఆయన జూన్ 24న తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉంటుంది.
రామ్ రహీమ్ తరఫు న్యాయవాది జితేందర్ ఖురానా మాట్లాడుతూ.. చట్టపరమైన నిబంధనల ప్రకారమే డేరా చీఫ్‌కు పెరోల్ మంజూరు చేశారని తెలిపారు. ఇందులో ఎలాంటి ప్రత్యేక సడలింపులు లేవని, ప్రతి ఖైదీకి ఉన్న హక్కుల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
గుర్మీత్ రామ్ రహీమ్ 2017లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అప్పటి నుంచి సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వివిధ కారణాలతో ఆయనకు పలుమార్లు పెరోల్, ఫర్లో మంజూరు కావడం వివాదాలకు దారితీస్తోంది.
2017లో శిక్ష పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన తాత్కాలికంగా జైలు వెలుపలికి రావడం ఇది 16వసారి కావడం గమనార్హం. ప్రతిసారి పెరోల్ మంజూరుపై ప్రతిపక్షాలు, సామాజిక సంస్థలు విమర్శలు గుప్పిస్తుంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆయనకు పెరోల్ ఇవ్వడం రాజకీయ చర్చలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి.
రామ్ రహీమ్‌కు భారీ సంఖ్యలో అనుచరులు ఉండటంతో ఆయన విడుదల సమయంలో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.
పెరోల్‌పై బయటకు వచ్చిన రామ్ రహీమ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చట్టపరమైన హక్కుల ప్రకారం పెరోల్ మంజూరు చేశామని ప్రభుత్వం చెబుతుండగా.. తరచూ ఆయనకు లభిస్తున్న సడలింపులపై విమర్శలు కొనసాగుతున్నాయి.





