ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు శనివారం వెల్లడించింది. తమ నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అమెరికా ఆంక్షలను ఎత్తివేసే వరకు, హర్మూజ్‌పై తమ కఠిన నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
అణ్వస్త్ర కార్యక్రమం సహా అన్ని అంశాలపై తమతో తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దాకా ఇరాన్ ఓడరేవుల ముట్టడిని ఆపేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోంది.
లెబనాన్ – ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా హర్మూజ్‌ను పూర్తిగా తెరిచినట్లు శుక్రవారమే ఇరాన్ ప్రకటించింది. అయినప్పటికీ తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా, కొన్ని గంటల్లోనే ఇరాన్ నిర్ణయాన్ని మార్చుకుంది.
హర్మూజ్ జలసంధి మార్గంలో మళ్లీ ఆంక్షలను అమల్లోకి తెచ్చామని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ (ఖతం అల్ అంబియా) శనివారం ప్రకటించింది. హర్మూజ్, దాని పరిసర ప్రాంతాలను మునుపటిలాగే తమ సైనిక దళాలు పకడ్బందీగా కంట్రోల్ చేస్తాయని తెలిపింది. తమ ఓడరేవులను ముట్టడించడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ఆరోపించింది. ఈ ముట్టడిని అమెరికా కొనసాగించినన్ని నాళ్లు, హర్మూజ్ ముట్టడిని తాము కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.
20న అమెరికా – ఇరాన్ మరోవిడత చర్చలు ?
అమెరికా – ఇరాన్ మధ్య మరోవిడత శాంతిచర్చలు సోమవారం రోజు (ఏప్రిల్ 20న) పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఇరుదేశాల ప్రతినిధులు ఆదివారంకల్లా ఇస్లామాబాద్‌కు చేరుకుంటారని సమాచారం. చర్చలతో సంబంధమున్న పలువురు ఇరాన్ అధికార వర్గాలు ఈవివరాలను చెప్పాయంటూ అమెరికా మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. సరిగ్గా ఈ తరుణంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ మళ్లీ ఆంక్షలను అమల్లోకి తేవడం గమనార్హం. అమెరికాపై ఒత్తిడిని పెంచడంతో పాటు తమ ఓడరేవుల ముట్టడిని అడ్డుకునేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
హర్మూజ్ నియంత్రణ విషయంలో ఇరాన్, ఇరాన్ ఓడరేవుల ముట్టడిపై అమెరికా మొండివైఖరితో వ్యవహరిస్తుండటంతో పశ్చిమాసియాలో మళ్లీ సైనిక ఉద్రిక్తతలు పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు (ఏప్రిల్ 17న) తుర్కియేలోని అంటాల్య నగరంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌తో ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, తుర్కియే అధ్యక్షుడు రజబ్ తయ్యబ్ ఎర్దోగన్ భేటీ అయ్యారు. అమెరికా – ఇరాన్ సైనిక ఉద్రిక్తతలను తగ్గించడం, పశ్చిమాసియా దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చించారు.





