చలో సెక్రటేరియట్ కు వెళ్తోన్న తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన పోలీసులు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరెస్టైన ఉద్యమకారులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉద్యమకారులను విడుదల చేసే వరకు అక్కడే ఉంటానని తేల్చి చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమకారులను జైల్లో పెట్టటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ తప్పించుకుంటోందని, నిలదీస్తే జైళ్లల్లో వేస్తుందన్నారు. వాగ్దానాలు అమలు చేయకుంటే కాంగ్రెస్ బయట తిరిగే పరిస్థితి ఉండదని ఈ సందర్బంగా ఆమె హెచ్చరించారు.
ఉద్యమకారులకు భూమి ఇస్తామని, పెన్షన్ ను ఇస్తామని చెప్పి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే జాగృతి ఆధ్వర్యంలో భూపోరాటాలు చేసి భూమిని ఆక్రమించుకుంటామని ఆమె అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్నదే ఉద్యమకారులు ఈ విషయాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ ఎస్, ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా మర్చిపోయారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని పాలించిన వారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఎద్దేవా చేశారు.
అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు పెన్షన్, భూమి ఇస్తామని చాలా హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్న సరే కాలయాపన చేస్తోంది, కానీ హమీలు ఎందుకు నేరవేర్చడం లేదని ప్రశ్నించారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై మనం ఒత్తిడి చేస్తే ఉద్యమకారుల బిల్లు పెడతామని హామీ ఇచ్చారు. కానీ అసెంబ్లీలో ఆ ఊసే ఎత్తకుండా మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమకారులు సెక్రటేరియేట్ ముట్టడించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం
ఉద్యమకారులంతా ధైర్యంగా ఉండాలి. మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. హక్కులు సాధించుకోవటం పెద్ద విషయం కాదనిఉద్యమకారులకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ఇస్తామన్న భూమి ఇవ్వకపోతే మనమే భూములను ఆక్రమించుకుందామన్నారు.
ఇప్పటికే ఉద్యమకారుల తరఫున భూపోరాటాలను జాగృతి ప్రారంభించింది.. మున్ముందు కూడా ఉద్యమకారులతో కలిసి పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.





