మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకుల తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిని ‘మావిగన్’ అని సంబోధిస్తూ జగన్ అపహాస్యం చేయడం ఆయన అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు .
బుధవారం విజయవాడలోని గురునానక్ కాలనీలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి ‘ముత్యాలముగ్గు’ సినిమాలో రావుగోపాలరావు పాత్రను తలపిస్తోందని, ఆయన ఏం మాట్లాడినా ‘తానా అంటే తందానా’ అనే చిడతల భజన బృందం చుట్టూ చేరిందని ఎద్దేవా చేశారు .
అమరావతిని, ప్రజలను అవమానించేలా జగన్ నోటి వెంట వస్తున్న రోత పలుకులను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు . విజయవాడలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని ఓ నాయకుడు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని, గతంలో మీ తండ్రి తెలుగుదేశం పార్టీ గురించి, అమరావతి గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని గుణదల వైసిపి నాయకుడికి హితవు పలికారు .
విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధికి అమరావతి ప్రాణాధారమని, కానీ గత ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసిందని ఎంపీ విమర్శించారు . గుణదల ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని అడ్డుకుని ప్రజలకు ఇబ్బందులు కలిగించింది వైకాపా నాయకులేనని, తాము అధికారంలోకి వచ్చిన త్వరలోనే ఆ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు .
నగరంలో బియ్యం మాఫియాను ప్రోత్సహిస్తున్నది ఎవరో అందరికీ తెలుసని, దమ్ముంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్లను గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వందల కోట్ల రూపాయలతో త్వరలోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు ప్రారంభిస్తామని చిన్ని స్పష్టం చేశారు .
తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యావల దేవదత్ నుంచి తాను డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలను ఎంపీ శివనాథ్ ఆయన తీవ్రంగా ఖండించారు . గత ఎన్నికలకు ముందు నుంచే తిరువూరు ఇన్ఛార్జిగా దేవదత్ ఉన్నారని, దేవదత్ ప్రజలకు సేవ చేసేందుకు సొంత నిధులు ఖర్చు పెట్టారని ఆయనతో ఒక్క రూపాయి కూడా లావాదేవీ తనకు లేదన్నారు.





