చిత్తూరు జిల్లాలో రెచ్చిపోతున్న కేటుగాళ్లు. ఇటీవలి కాలంలో మోసగాళ్లు వినూత్న పద్ధతులు అవలంబిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. తాజాగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకున్న ఘటన స్థానికులను ఆశ్చార్యానికి గురిచేసింది.
సోమవారం మధ్యాహ్న సమయంలో ఓ మహిళ బ్యాంకు సమీపంలో ఉండగా, ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆమె వద్దకు వచ్చారు. వారు తమను మంచి మనుషుల్లా చూపిస్తూ, “ఇక్కడ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మీ బంగారు నగలు జాగ్రత్తగా దాచుకోండి” అంటూ ఆమె బంగారు గోలుసును తీయ్యడానికి సహాయం చేస్తున్నట్టు చేసి, గోలుసును తీసుకుని ఓ కాగితంలో చుట్టి ఇచ్చినట్లు ఇచ్చారు.
ఆ పొట్లాన్ని తీసుకుని బ్యాంకు లోపలికి వెళ్లింది. అక్కడ పొట్లం విప్పి చూడగా, అందులో బంగారు గొలుసుకు బదులుగా రాళ్లు ఉండటంతో నిర్ఘాంతపోయింది. తాను మోసపోయానని గ్రహించి గట్టిగా విలపించింది. ఈ లోపు ఆ యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు పరిసర ప్రాంతాల్లో వెతికినా, దుండగుల ఆనవాళ్లు కనిపించలేదు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తుమన్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల ఎక్కువవుతున్నాయని పోలీసులు తెలిపారు. వీటి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
అపరిచితుల మాటలను నమ్మవద్దని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని, విలువైన నగలు బయట ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.





