కాలిఫోర్నియా వీక్షణం గవాక్షం 168వ అంతర్జాల సమావేశం

Must read


15వ ఆగష్టు 2026, శనివారం, కాలిఫోర్నియా వీక్షణం సాహితీ సమావేశం ముచ్చటగా మూడు గంటలు జరిగింది. మొదట వీక్షణం వ్యవస్థాపుకురాలు మరియు అధ్యక్షురాలైన డాక్టర్ గీతా మాధవి స్వీయ పరిచయం చేసుకోబోతున్న కవులు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మికి, బిటవరం శ్రీమన్నారాయణకి, కవిమిత్రులకు మరియు సాహీత్యాభిమానులకు ఆహ్వానం పలికి సమావేశాన్ని ప్రారంభించారు.

పిమ్మట వీక్షణం భారతదేశ ప్రతినిధి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ చీదెళ్ళ సీతాలక్ష్మిని సభకు పరిచయం చేసి వారి జీవితం గురించి, సాహిత్య ప్రస్థానం గురించి, వారి రచనల గురించి మరియు యువ కవులకు సూచనలు ఇవ్వమని కోరారు.

డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి కరెంటు కూడా లేని పల్లెలో పుట్టి, గుడ్డి దీపం కింద చదువుకుని పైకొచ్చానన్నారు. అన్ని క్లాసులలోనూ ప్రథమురాలుగా వచ్చేదానినని చెప్పారు. మిగతా సమయాన్ని లైబ్రరీలో గడిపేదాన్నని అన్నారు. శ్రీశ్రీ, దివాకర్ల, దాశరథి వంటి మహాకవుల ఉపన్యాసాలు విని సాహిత్యంపై అభిలాషను పెంచుకున్నానన్నారు.ఛందోబద్ధ పద్యాలనే గాక అన్ని ప్రక్రియలలోనూ వ్రాసానని చెప్పారు. అనేక పురస్కారాలను అందుకున్నానన్నారు.

తర్వాత రాజేంద్రప్రసాద్ బిటవరం శ్రీమన్నారాయణ గురించి వివరాలు చెప్పి ప్రసంగించవలసినదిగా కోరారు. తదుపరి శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ తన స్వీయపరిచయంలో తన తండ్రిగారు హిందీ పండిట్ అని. తను వ్యాపార రీత్యా అనేక రాష్ట్రాలు తిరగడం వల్ల బహుభాషా కోవిదుడనై అన్ని భాషలలో కవిత్వం వ్రాస్తున్నానన్నారు. వరంగల్ వాచస్పతి, కాకతీయ నంది అవార్డు లాంటి అనేక బహుమతులు పొందాను అని చెప్పారు. షుమారు 5000 పైగా కవితలు తెలుగు, ఆంగ్లేయము, హిందీ భాషలలో రచనలు చేశానని చెప్పారు.

కావలి కవి రామాయణం ప్రసాదరావు మాట్లాడుతూ నాలుగు నెలలుగా ప్రవేశపెట్టిన ఈ స్వీయ పరిచయ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఉన్నదని చెప్పారు. వనపర్తి కవి వడ్ల వీరాచారి మాట్లాడుతూ అననుకూల పరిస్థిస్తుల్లోను తెలుగు పై అభిమానంతో సాహితీ బాటలో పయనిస్తూ మంచి కవులుగా ఎదిగినందుకు స్వీయ పరిచయకర్తలకు అభినందనలు తెలిపారు. అతిధుల ప్రసంగాలు బాగా ఉన్నాయని చాలామంది వక్తలు కొనియాడారు.

తర్వాత కవిసమ్మేళనాన్ని గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ నిర్వహించారు.
మొదటగా డాక్టర్ గీతా మాధవి ” తక్కెడ” అనే విశిష్టమైన కవిత అందరినీ ఆకట్టుకుంది.ఈ లోకం ఎవర్ని ఎలా తూస్తుందో తెలియదు అంటూ అద్భుతంగా సాగింది కవిత. డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి తన ఎన్నికల ఫీట్లు కవితలోని అంత్యప్రాసలు ఆకట్టుకున్నాయి. బిటవరం శ్రీమన్నారాయణ స్వాతంత్ర్యం నీ జన్మ హక్కు అంటూ ఓటర్ల కర్తవ్యాన్ని తెలిపారు. గుర్రం సురేందర్ నీ మీద ఒట్టు వోటరన్నా అనే సందేశాత్మక కవితను వినిపించారు. కట్టా శ్యామలాదేవి ప్రకృతి సౌందర్యాన్ని అందంగా వర్ణించారు. పరిమి వెంకట సత్యమూర్తి త్యాగాల కంచె అనే కవితలో సరిహాద్దులలోని సిపాయిల త్యాగాన్ని శ్లాఘించారు.

అయ్యల సోమయాజుల ప్రసాద్ కవితా జననం అనే కవితను చదవగా, సిరిమల్లె మంజులగారు మనిషిలోని ఓ మనిషీ అనే కవితను మానవుడివా దానవుడివా అంటూ సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తూ చదివారు. డా.బృంద ఆనవాయితీకి భిన్నంగా సాధికారపు సంకెళ్ళు అనే కవిత చదివారు. మామూలుగా కమ్మని గాత్రంతో పాడేవారు. బుక్కపట్నం రమాదేవి స్వప్న సంకలనం అనే కవిత చదవగా, బంతికట్ల నాగేశ్వరరెడ్డి వారు వ్రాసిన రామాయణ కావ్యం నుండి పద్యాలు చదివారు. శరత్కవి మూర్తి స్వయంకృతాపరాధం అనే .కవితను కాలుష్యంపై చదివారు.

శ్రీలత దావన్ కలం తిరుగుబాటు కవిత చాలా బావుంది. అమీనా బేగం ప్రజాసేవలో దేవుళ్ళు అనే కవితను చదివి ,సర్వమత సామరస్యం గురించి తన చక్కగా వివరించారు. చివరగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మీ కవితాంశాలు బాగున్నాయి, ఉపదేశాలు బాగున్నాయి, సందేశాలు బాగున్నాయి, దరహాసాలు బాగున్నాయి, వేషాలు బాగున్నాయి, విశ్వాసాలు బాగున్నాయి, సారంశాలు బాగున్నాయి, ఉద్ధేశాలు బాగున్నాయి అంటూ ఉద్రేకంగా చదివిన కవిత చాలా బాగుంది. బాగుండటం మాత్రమే కాదు సభకి హైలైట్ అయ్యింది అందరూ ప్రశంసించారు. డా గీతామాదవి వందన సమర్పణతో 168వ సమావేశం ముగిసింది. చక్కని సాహితీ సమావేశం నిర్వహించినందుకు పాల్గొన్న కవులందరూ సంతోషం వ్యక్తపరిచారు. వచ్చేనెల వార్షిక సమావేశానికి ఎదురుచూస్తుంటామని పలువురు కవులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!