తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల సాధికారతకు బలమైన మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల (VO) భవనాల నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం గ్రామీణాభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తోంది.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి మహిళా భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పటికే 8,193 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించారు. అందులో 6,261 భవనాలకు కలెక్టర్ల నుంచి అనుమతులు లభించాయి. అలాగే 5,017 భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం జిల్లాల వారీగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రత్యేక చొరవతో సెర్ప్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేశారు. దీనివల్ల స్థలాల గుర్తింపు నుంచి అనుమతులు, అంచనాలు, నిర్మాణం వరకు అన్ని దశల్లో పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లాలో పలు గ్రామాల్లో మహిళా భవనాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు మండలం సర్వేపల్లి గ్రామంలో VO భవనం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాలో కేశంపేట మండలం ఆల్వాల్ గ్రామపంచాయతీలో కూడా భవనం నిర్మాణం పూర్తయింది.ఈ మహిళా భవనాలు గ్రామీణ మహిళలకు ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలవనున్నాయి. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలకు ఇవి కేంద్రాలుగా మారనున్నాయి. అంతేకాకుండా, మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి కూడా ఈ భవనాలు వేదికగా ఉపయోగపడనున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రతి గ్రామంలో మహిళలకు బలమైన వేదిక కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాల భవనాలు వారి ఆర్థిక, సామాజిక బలోపేతానికి కేంద్రాలుగా మారతాయి. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకోవడానికి, ఒకచోట చేరి నిర్ణయాలు తీసుకునే వేదికగా ఇవి ఉపయోగపడతాయి” అని తెలిపారు.నిర్దిష్ట కాలంలో ఈ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.





