తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జోసేఫ్ విజయ్ తీసుకున్న తొలి నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే రాష్ట్రంలోని 717 మద్యం దుకాణాలను మూసివేస్తూ ఆయన తొలి సంతకం చేశారు.
దేవాలయాలు, పాఠశాలలు, బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో కొనసాగుతున్న మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల నుంచి చాలా కాలంగా వస్తున్న డిమాండ్‌కు స్పందిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన ప్రముఖ నటుడు విశాల్ సీఎం విజయ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో భావోద్వేగ పోస్టు చేశారు. “డియర్ సీఎం జోసెఫ్ విజయ్ గారు.. మీకు మా అభినందనలు. 717 వైన్ షాపులను, ముఖ్యంగా స్కూళ్ల దగ్గర ఉన్న వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు” అంటూ విశాల్ తన పోస్టులో పేర్కొన్నారు.
“ఆర్కే నగర్‌లో నాకు తెలిసిన ఒక విద్యార్థిని రోజూ మద్యం దుకాణం దాటుకుని ఇంటికి వెళ్లేందుకు చాలా భయపడేది. ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఎంతోమంది సామాన్యులు మీ నిర్ణయాన్ని మెచ్చుకుంటారు” అని ఆయన తెలిపారు.
విజయ్ నిర్ణయం సమాజంపై మంచి ప్రభావం చూపుతుందని విశాల్ అభిప్రాయపడ్డారు. “ఈ నిర్ణయంతో ఎన్నో ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. ఈ ఆనందం ఎప్పటికీ నిలిచిపోతుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి” అంటూ ఆయన సీఎం విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
మద్యం దుకాణాల మూసివేత నిర్ణయంపై తమిళనాడులో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ చర్యను స్వాగతిస్తున్నారు. స్కూళ్లు, దేవాలయాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండటం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపశమనం కలిగిస్తోందని ప్రజలు చెబుతున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాజకీయ విశ్లేషకులు కీలక సంకేతంగా చూస్తున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాననే సందేశాన్ని ఆయన పంపారని భావిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా ఓటర్లు, యువతలో ఈ నిర్ణయం సానుకూల ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా విజయ్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇటీవల నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హసన్ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాల్ కూడా బహిరంగంగా మద్దతు తెలిపారు.





