పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్చలు భవిష్యత్ భౌగోళిక-రాజకీయ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ సమావేశం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం అపూర్వ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నగరం మొత్తం ఒక భద్రతా వలయంలోకి తీసుకువచ్చి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు అమలు చేసింది. ముఖ్యంగా చర్చలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతను మరింత కఠినతరం చేసింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం, ఇరాన్ అధికారుల రాకతో ఇస్లామాబాద్ నగరంలో దాదాపు లాక్‌డౌన్ వాతావరణం నెలకొంది. ఈ చర్చలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 10, 11 తేదీలను ప్రభుత్వ సెలవులుగా దినాలుగా ప్రకటించింది. దీంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి.
చర్చలు జరుగుతున్న ప్రఖ్యాత సెరీనా హోటల్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు విధించారు. దాదాపు 3 కిలోమీటర్ల పరిధిలో సాధారణ ప్రజల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వ్యూహాత్మకంగా కీలకమైన ‘రెడ్ జోన్’కు వెళ్లే ప్రధాన రహదారులను భారీ కంటైనర్లతో మూసివేసి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఇక భద్రత కోసం వేలాది మంది పోలీసు సిబ్బంది, పారామిలటరీ బలగాలను మోహరించారు. సీసీటీవీ నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు. విదేశీ ప్రతినిధుల భద్రతకు ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.
ఈ చర్చలు అమెరికా–ఇరాన్ మధ్య ఉన్న విభేదాలను తగ్గించడంలో కీలకంగా మారే అవకాశముంది. ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, ప్రాంతీయ భద్రత వంటి పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ సమావేశంపై ఆసక్తిగా గమనిస్తున్నాయి.
అంతర్జాతీయ సంబంధాల్లో ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలవొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌తో సంబంధాల మెరుగుదలపై అమెరికా వైఖరి ఎలా ఉంటుందో, అలాగే ఇరాన్ స్పందన ఎలా ఉంటుందో అనే అంశాలు కీలకంగా మారాయి.





