ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా ఆధునిక నగర నిర్మాణ నమూనాలను అధ్యయనం చేసేందుకు ఏపీ మంత్రుల బృందం విదేశీ పర్యటనలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఈ బృందం, అక్కడి ప్రముఖ ప్రాజెక్టులను సందర్శిస్తూ అమరావతి అభివృద్ధికి అనుసరించదగిన అంశాలను పరిశీలిస్తోంది.
ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లోని ప్రసిద్ధ బెరినా బ్యారేజ్ ను మంత్రుల బృందం సందర్శించింది. వరద నియంత్రణ, నీటి నిల్వ, తాగునీటి సరఫరా, పర్యాటక అభివృద్ధిని ఒకేచోట సమన్వయం చేసిన ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో దీని నిర్మాణ శైలి, నిర్వహణ విధానం, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను మంత్రులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు ఈ సందర్శన జరిగింది. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నగర ప్రణాళికలో నీటి వనరుల సమర్థ వినియోగం ఎంత కీలకమో ఈ ప్రాజెక్టు ద్వారా తెలుసుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా నేషనల్ యునివర్సీ ఆఫ్ సింగాపూర్ కు చెందిన సిటీస్ డైరెక్టర్ ఖూ టెంగ్ చై మంత్రుల బృందానికి వివరణ ఇచ్చారు. పర్యావరణానికి హాని కలగకుండా నగరాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ఆయన వివరించారు. ముఖ్యంగా గ్రీన్ రూఫ్ వంటి నిర్మాణాలతో, నీటి వనరులను సమర్థంగా ఉపయోగిస్తూ, ప్రజలకు వినోదం కలిగించే ప్రదేశంగా ఎలా తీర్చిదిద్దారో వివరించారు.
మెరీనా బ్యారేజీ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది వరద నియంత్రణ. భారీ వర్షాల సమయంలో నగరాన్ని వరదల నుంచి రక్షించే విధంగా ఇది నిర్మించబడింది. అదే సమయంలో నీటిని నిల్వ ఉంచి, తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించారు. అదనంగా, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు విశ్రాంతి, వినోదం కలిగించేలా తీర్చిదిద్దారు. ఈ సమగ్ర విధానం మంత్రుల బృందాన్ని ఆకట్టుకుంది.
అమరావతిలో కూడా ఇలాంటి సమగ్ర ప్రణాళికలను అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన సాగుతోందని అధికారులు తెలిపారు. వరద నియంత్రణ, నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలను కలిపి రాజధాని నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ మోడల్ అమరావతికి మార్గదర్శకంగా నిలవవచ్చనిన్నారు.
మంత్రుల బృందం ఈ పర్యటనలో ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను కూడా సందర్శించి, నగరాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను అధ్యయనం చేస్తోంది. భవిష్యత్తులో అమరావతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ఈ అనుభవాలు ఉపయోగపడతాయని వారు విశ్వసిస్తున్నారు.





