తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి వేగం పెంచాలి :సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Must read

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఈఎన్సీ శ్రీధర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.తుమ్మిడి హెట్టి బ్యారేజ్ ని ఎంత ఎత్తున నిర్మించాలి.. ఎంత ఎత్తు నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందని ఈ సందర్బంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 11 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగింది. ఇప్పటికే 71.5 కిలోమీటర్ల కెనాల్ వర్క్ జరిగిందని అధికారులు సీఎం కు వివరించారు.150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని సూచించారు.

చేపట్టిన నిర్మాణాలన్నిటిని సద్వినియోగం చేసుకునేందుకు 150 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మించాలని నిపుణులు సూచించారు. గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు అంగీకరించిందని.. 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందని మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చు తో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు.

ఈ బ్యారేజ్ నిర్మాణం చేపడితే ఆదిలాబాద్ తో పాటు తెలంగాణలో మెట్ట ప్రాంతాల రైతుల కు సాగు తాగు నీరు అందుతుందని, తక్కువ ఖర్చుతో గ్రావిటీ పై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ కు నీటిని తెచ్చుకునే వీలుంటుందని సీఎం చెప్పారు.

ప్రాజెక్ట్ ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్ర తో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్ర లో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సీఎం సూచించారు. సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు.

రేపు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిసి చర్చించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అప్పగించారు, తుమ్మిడిహెట్టి బ్యారేజ్ అవసరం దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రైతుల తరపున విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్దరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు. వానలు పడేలోపు పనులు పూర్తి చేయాలని మరోసారి స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!