రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించేలా వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) హర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు కొనియాడారు. 14 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కుటుంబాలకు ఇది గొప్ప భరోసా అని ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ సానుకూల దృక్పథాన్ని స్పష్టం చేశారు. “రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ట్రస్ట్ లాంటిది. ప్రభుత్వ ఉద్యోగులతో సహా నేను కూడా మీలాగే మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాను. మీ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని.. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత నాదే. మనమంతా ప్రజా సేవకులం. మీ పాత్ర, నా పాత్ర వేరు కావచ్చు కానీ, ప్రజలకు సేవ చేయడమే మనందరి లక్ష్యం” అని సీఎం దిశానిర్దేశం చేశారు. అధికారులు, ఉద్యోగులు తనను ‘సార్’ అని పిలవడం కంటే ‘రేవంత్ అన్నా’ అని పిలిస్తేనే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు.
సింగరేణిలో తొలిసారి ఈ బీమా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కొందరు అపనమ్మకంతో ఉన్నారని సీఎం గుర్తుచేశారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన 45 మంది కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించి ఆదుకున్నామని వివరించారు. “ప్రభుత్వం మారినప్పుడు కేవలం 15 మంది మంత్రులు మాత్రమే మారతారు.. పాలనా యంత్రాంగం, ఉద్యోగులంతా పాతవారే ఉంటారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీజీఈజేఏసీ నేత ఏలూరు శ్రీనివాసరావు ఇద్దరూ ఖమ్మం జిల్లా వారే.. మంత్రి పొన్నం ప్రభాకర్, జగదీశ్వర్ కరీంనగర్ మిత్రులు. మీ అందరినీ సమన్వయం చేసే ఒక ‘గుంపు మేస్త్రీ’ని మాత్రమే నేను” అని ముఖ్యమంత్రి ఆత్మీయంగా పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో వేతనాలు వాయిదాల పద్ధతిలో వచ్చేవని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. పాత పెన్షన్ బకాయిల చెల్లింపులను రూ.100 కోట్ల నుంచి రూ.2000 కోట్లకు పెంచామని, రాబోయే రెండు నెలల్లో ఏకంగా రూ.4,000 కోట్ల రిటైర్ ఉద్యోగుల బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రం కొంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే మరిన్ని ప్రయోజనాలను కచ్చితంగా ఉద్యోగులకు పంచుతామన్నారు.
ప్రభుత్వానికి ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లని, ఏ ఉద్యోగీ ఆకలితో ఉండకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొందరు పన్నులు ఎగ్గొడుతున్నారని, వాటిని అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని రక్షించే బాధ్యత ఉద్యోగులు తీసుకోవాలన్నారు. ఈ మధ్య కాలంలో జీఎస్టీ వసూళ్లు పెరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే మహత్తర లక్ష్యంలో ఉద్యోగులందరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు దామోదర్ రెడ్డి, ముజీబ్ హుస్సేన్, బి. శ్యామ్, సదానంద్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, గజేందర్, కృష్ణ మూర్తి, వెంకట్ రెడ్డి, మోహన్ నారాయణ, ఉమాదేవి తదిరులు పాల్గొన్నారు.





