తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, ఆయా శాఖల కార్యక్రమాలు, సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం నలుగురు దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. 768 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.69.19 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. అలాగే ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
పీఎం శ్రీ పాఠశాలల్లో నిర్వహించిన వేసవి శిబిరాలలో విశిష్ట సేవలు అందించిన ప్రధానో
పాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఐబీ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





