స్కిల్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు కలిసి రండి :మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

Must read

  • స్కిల్లింగ్‌, అప్‌స్కిల్లింగ్‌, రీస్కిల్లింగ్‌లో భాగస్వామ్యం అవ్వండి

తెలంగాణను స్కిల్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్లింగ్‌, అప్‌స్కిల్లింగ్‌, రీస్కిల్లింగ్‌ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ‘రెడీ టూ వర్క్‌ ఫోర్స్‌’గా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు.

బుధవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణాలో బోయింగ్‌, లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌ (ఎల్‌ఎల్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ‘బోయింగ్‌ స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌’ను విజయవంతంగా పూర్తి చేసిన యువత, దివ్యాంగులు, వెటరన్స్ కు ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… టెక్నాలజీ, ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయన్నారు. ఆ దిశగా యువతను తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, నిపుణులు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించాలనే సంకల్పంతో రాష్ట్రంలో స్కిల్లింగ్‌ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. ఆధునిక, పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించేందుకు ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అకడమిక్‌ కరిక్యులమ్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయడంతో పాటు అనేక కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టామన్నారు.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకుంటూ భవిష్యత్‌ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో బోయింగ్‌, లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ ప్రతినిధులు ప్రవీణ, యశోద, రష్మీ ప్రభ మిశ్రా, బితుపాన్ బోరా, రత్న శేఖర్ రెడ్డి, ఓం దేవ్, డా. విజయ్ కృష్ణ కాంత్ తదితరులు పాల్గొన్నారు.

బోయింగ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ వంటి పరిశ్రమ భాగస్వామ్య కార్యక్రమాలు యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంచేందుకు ఉపయోగపడతాయని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన యువత, దివ్యాంగులు, వెటరన్స్‌కు ధ్రువీకరణ పత్రాలు అందించడం ద్వారా వారికి మరింత ఆత్మవిశ్వాసం కలుగుతుందని అన్నారు. సమాజంలోని విభిన్న వర్గాలకు సమానంగా నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నైపుణ్య శిక్షణను నగర ప్రాంతాలకే పరిమితం చేయకుండా అవసరమైన చోట్ల విస్తరించే దిశగా కూడా ప్రభుత్వం పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం నవీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. పరిశ్రమలు ఏ నైపుణ్యాల కోసం ఉద్యోగులను వెతుకుతున్నాయి, రాబోయే సంవత్సరాల్లో ఏ టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతుంది, వాటికి అవసరమైన శిక్షణ ఎలా ఉండాలి అనే అంశాలపై నిరంతర సమీక్ష అవసరమని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే స్కిల్ కార్యక్రమాలు ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుసంధానమైతే శిక్షణ పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!