తెలంగాణ రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీచడంతో బయటకు రావడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వడదెబ్బ కారణంగా ఒక్కరోజే నలుగురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లాకు చెందిన సాదుల నరహరి (58), వరంగల్ కు చెందిన ఎండీ యాకూబీ (63), మంచిర్యాలా జిల్లా వాసి కొట్రంగి జయరాం (40), సూర్యపేట జిల్లాకు చెందిన మామిడి నరసింహ (51) వడదెబ్బతో మరణించారు. వీరంతా తమ తమ పనులకు వెళ్లి ఎండలో ఎక్కువసేపు ఉండడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రులకు తరలించేలోపే వారు మృతి చెందినట్లు సమాచారం.
ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కోమరం బీం, ఆసీఫా బాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో కూడా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదే పరిస్థితి కామరెడ్డి, అదిలాబాద్, భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట్ జిల్లాల్లోనూ కనిపిస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావడాన్ని తగ్గిస్తున్నారు. ముఖ్యంగా కార్మికులు, రైతులు, బయట పనులు చేసే వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.
వైద్య నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. అవసరం లేకుండా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తలపై టోపీ లేదా గుడ్డ కప్పుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, దాహం లేకపోయినా ద్రవాలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు.
వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. తలనొప్పి, తల తిరగడం, అధిక చెమటలు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇక వాతావరణ శాఖ అధికారులు కూడా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వడగాలుల హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.





