అమెరికాలో అధ్యక్షుడు డెనాల్డ్ ట్రంప్ పాల్గొన్న కార్యక్రమం సమీపంలో జరిగిన కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారన్న వార్త తనకు ఉపశమనం కలిగించిందని ప్రధాని పేర్కొన్నారు.
ఈ సంఘటన వాషింగ్టన్ డీసీలోని వాషింగ్ హిల్టన్ లో శనివారం రాత్రి జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ట్రంప్‌తో పాటు ప్రథమ మహిళ మెలేనియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కార్యక్రమం జరుగుతున్న సమయంలో హోటల్ వెలుపల ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఈ శబ్దాలతో అక్కడ ఉన్నవారిలో తీవ్ర భయాందోళన నెలకొంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రంప్ దంపతులతో పాటు ఇతర ఉన్నతాధికారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.
ఈ ఘటన నేపథ్యంలో కార్యక్రమాన్ని తక్షణమే రద్దు చేశారు. అనంతరం హోటల్ పరిసర ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి, అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు. కాల్పులకు గల కారణాలపై అమెరికా భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
ఈ ఘటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక Xలో స్పందించారు. “అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారన్న వార్త తెలిసి నాకు ఉపశమనం కలిగింది. వారి భద్రత, శ్రేయస్సు కోసం నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. దానిని ఖండించాలి” అని ఆయన పేర్కొన్నారు.
మోదీ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై ప్రాధాన్యత పొందాయి. ప్రజాస్వామ్య దేశాల్లో శాంతి, భద్రతను కాపాడటం ఎంత ముఖ్యమో ఆయన సందేశం ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఘటనపై ఇతర దేశాల నేతలు కూడా స్పందిస్తూ హింసను ఖండించారు.





