”హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు డెవలప్మెంట్ సెంటర్ ఇస్తే.. మేము మీకు ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈఓలను ఇస్తాం” అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని యు.ఎస్. కాన్సులేట్‌లో నిర్వహించిన ‘ఫ్రీడమ్ 250’ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1990లలో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం నుంచి.. నేడు సత్య నాదెళ్ల ఆ సంస్థకు సీఈఓగా ఎదగడం వరకు ఉన్న ప్రయాణాన్ని గుర్తుచేస్తూ, తెలుగు వారి నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని ఆయన కొనియాడారు.
”హైదరాబాద్‌కూ అమెరికాకూ ఉన్న బంధం కేవలం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న దౌత్య సంబంధం కాదు. ఇది ప్రజల మధ్య, కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధం. ఈ రోజు మన ఇళ్లలో అమెరికా అనేది మ్యాప్‌లో చూసే ఒక దేశం కాదు. అక్కడ చదువుకుంటున్న మన పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న బంధువులు, స్టార్టప్‌లు పెడుతున్న యువత రూపంలో అమెరికా ప్రతి తెలుగు ఇంట్లో ఒక భాగమైంది. ఇప్పుడు మనం అమెరికాకు వెళ్తున్నాం అని కాదు, తెలుగే నేరుగా అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడ వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు నిలవడం మనందరికీ గర్వకారణం.” అని అన్నారు.
”తెలంగాణ-అమెరికా భాగస్వామ్యం ఇప్పుడు కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. అది దాటి ‘సహసృష్టి’ (Co-creation) దశలోకి అడుగుపెట్టింది. జీవవిజ్ఞానం (లైఫ్ సైన్సెస్), వ్యాక్సిన్ల తయారీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో మన బంధం మరింత గట్టిపడింది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), శుద్ధ ఇంధనం (క్లీన్ ఎనర్జీ), ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో ఈ భాగస్వామ్యం మరిన్ని కొత్త పుంతలు తొక్కబోతోంది.” అని వెల్లడించారు.
”తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా.. అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధానికి గుర్తుగా ఇక్కడి యు.ఎస్. కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయించాం” అని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆ రహదారి పేరు ఫలకాన్ని ఆవిష్కరించేందుకు వేదికపై ఉన్న అమెరికా రాయబారి సెర్జియో గోర్, కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌లను ఆయన ఆహ్వానించారు.
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు, ఐటీ రంగం, ఆవిష్కరణలు మరియు స్టార్టప్‌లకు అత్యంత అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు తమ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), డేటా సైన్స్, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో తెలంగాణను ముందంజలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న ఈ చారిత్రాత్మక సందర్భంగా నిర్వహించిన ‘ఫ్రీడమ్ 250’ వేడుకలు రెండు ప్రాంతాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని భట్టి అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, ఆవిష్కరణలు, విజ్ఞానం మరియు ఆర్థికాభివృద్ధి వంటి అంశాల్లో అమెరికా-భారత్ భాగస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
డెక్కన్ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన యు.ఎస్. కాన్సులేట్ కొత్త భవనం సాంస్కృతిక దౌత్యానికి ప్రతీక అని, హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడటంలో అమెరికా అందిస్తున్న సహకారం అభినందనీయమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.





