తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అత్యున్నత అధికారి బి. శివధర్ రెడ్డి ఆదివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ భద్రత, పెరుగుతున్న సైబర్ నేరాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రత్యేకంగా రోడ్డు ప్రమాదాలపై డీజీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారుల మరణాల రేటు అధికంగా ఉండటం గమనించదగ్గ విషయమని అన్నారు. “పాదచారులే రోడ్డుపై రాజులు” అనే నినాదం ఉన్నప్పటికీ, వారి ప్రాణాలు ప్రమాదాల్లో కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ నెల 13 నుంచి 18 వరకు ‘అలైవ్ అరైవ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ప్రత్యేక సదస్సులు, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్యంగా 42-45 ఏళ్ల వయస్సు గల వ్యక్తులు రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారని, వీరు కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషించే వారు కావడంతో వారి మరణాలు కుటుంబాలను ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.
ట్రాఫిక్ నియమాల అమలులో కఠినత్వం అవసరమని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి డ్రైవర్ “డిఫెన్సివ్ డ్రైవింగ్” అలవాటు చేసుకోవాలని, వాహనం నడిపేటప్పుడు చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ట్రాఫిక్ భద్రతతో పాటు సైబర్ నేరాల పెరుగుదలపై కూడా డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను ఉపయోగించుకుని మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్ట్ టైమ్ జాబ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త తరహా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరగా స్పందిస్తే కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఈ సమావేశంలో డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ, ఐటీ కారిడార్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు. మురికివాడల్లోని విద్యార్థులు నేరాల బారిన పడకుండా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఐటీ కారిడార్‌లో సాధారణ రోజుల్లో సుమారు 22 లక్షల వాహనాలు, పండుగల సమయంలో 26 లక్షల వాహనాలు సంచరిస్తున్నాయి. ట్రాఫిక్ నిర్వహణ కోసం 37 ప్రాంతాల్లో వాహన లెక్కింపు కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ ప్రజలను అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ భద్రతపై అవగాహన పెంచడం ద్వారా మోసాలను తగ్గించవచ్చని చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో డీసీపీలు ముత్యం రెడ్డి, కోటి రెడ్డి, రితిరాజ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





