బీసీ మహిళలకు ఉప కోటా కోసం ఉద్యమిస్తాం : కవిత

Must read

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, చట్టసభల్లో బీసీ మహిళలకు ఉప కోటా సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేక ఉప కోటా ఇవ్వకపోవడం అనేది పెద్ద అన్యాయం అని ఆమె పేర్కొన్నారు. దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఈ విషయంలో చూపుతున్న నిర్లక్ష్యం ఆ వర్గాల పట్ల గౌరవం లేకపోవడానికే నిదర్శనమని ఆమె విమర్శించారు. బీసీ మహిళలకు న్యాయం జరగకపోతే, దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో పోరాటం చేపడతామని హెచ్చరించారు.

“మరోసారి మహాత్మా పూలే పుట్టినట్లుగా కేంద్రానికి వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమాన్ని నిర్మిస్తాం” అంటూ కవిత గట్టిగా హెచ్చరించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహిళల హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై జరగనున్న చర్చల సమయంలో తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు కవిత తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి బీసీ మహిళలకు ఉప కోటా అవసరాన్ని వివరించనున్నట్లు చెప్పారు. కేవలం మెజారిటీ ఉందన్న అహంకారంతో బిల్లును ఆమోదించి బీసీలకు అన్యాయం చేస్తే, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆమె తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యంపై కూడా కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ, ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడాన్ని ఆమె ఖండించారు.

అంబేద్కర్ జయంతి నాటికైనా పూలే విగ్రహ ఏర్పాటును పూర్తి చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాల ఏర్పాటులో జాప్యం అనేది అసహనానికి గురిచేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాగృతి కార్యకర్తలు, మహిళా నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, బీసీ మహిళల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!