అమరావతి ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాసాధన కార్యక్రమంలో యోగా గురువు రామ్ దేవ్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా భారతదేశానికి గర్వకారణమని, ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప సంపద అని అన్నారు. సీఎం చంద్రబాబు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినప్పటికీ తాను యోగా అతిథిగా వచ్చానని తెలిపారు. చంద్రబాబు తరహాలో ప్రతి ముఖ్యమంత్రి అభివృద్ధి దిశగా పనిచేస్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యం ముందుగానే సాకారం అవుతుందని అభిప్రాయపడ్డారు. దేవతల రాజధానిగా పేరుగాంచిన అమరావతి ఇప్పుడు యోగ రాజధానిగా మారిందని అన్నారు. పచ్చదనం, ప్రకృతి సౌందర్యంతో అమరావతిని తీర్చిదిద్దుతున్నారని, ఇక్కడ స్విట్జర్లాండ్ తరహా అందాలు కనిపిస్తున్నాయని ప్రశంసించారు. ఉండవల్లి గుహల్లోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రకృతి ప్రేమికుడు, సాంస్కృతిక ప్రేమికుడు, యోగా ప్రేమికుడు, సర్వజన ప్రేమికుడని కొనియాడారు. ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్ లక్ష్యంతో ప్రధాని మోదీ చేస్తున్న కృషికి చంద్రబాబు సహకరిస్తున్నారని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనతో పాటు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు చంద్రబాబు తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఒక యోగి, కర్మయోగి అని రామ్ దేవ్ బాబా ప్రశంసించారు.
చంద్రబాబు యోగి, కర్మయోగి: రామ్ దేవ్ బాబా





