మెక్సికో కామిక్ కాన్‌లో రాజమౌళి ‘వారణాసి’ ప్రమోషన్

Must read

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటైన దర్శకధీరుడు ఎస్​ ఎస్​ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్​ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా ప్రమోషన్ల పర్వం అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభ దశ నుంచే భారీ అంచనాలను సృష్టించగా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు మొదలవడం సినీ వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

ఈ ప్రమోషన్లకు వేదికగా నిలిచింది మెక్సికోలో జరిగిన ప్రఖ్యాత CCXP 2026 కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా సినిమా, కామిక్, గేమింగ్ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే ఈ ఈవెంట్‌లో ‘వారణాసి’ చిత్రాన్ని పరిచయం చేయడం ద్వారా చిత్ర బృందం అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

ఈ కార్యక్రమానికి రాజమౌళి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినప్పటికీ, ప్రత్యేకంగా రికార్డు చేసిన వీడియో సందేశం ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. తనకు మాయన్ నాగరికతపై ప్రత్యేకమైన ఆసక్తి ఉందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వారి నిర్మాణ శైలి, ఆర్కిటెక్చర్ తనను ఎంతగానో ఆకర్షించిందని తెలిపారు.

ఈ సందర్భంగా తన గత బ్లాక్‌బస్టర్ చిత్రం బాహుబలి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. “బాహుబలి చిత్రంలో నగర కేంద్రం, సింహాసనం వంటి కీలక సెట్ల రూపకల్పనకు మెక్సికోలోని ప్రఖ్యాత చిచెన్ ఇట్జా పిరమిడ్​ నుంచి స్ఫూర్తి పొందాను” అని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఆకట్టుకున్నాయి.

ఈ ప్యానెల్ చర్చలో రాజమౌళి కుమారుడు, చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్​ ఎస్​ కార్తికేయా స్వయంగా పాల్గొన్నారు. ఆయన సినిమా గురించి మరిన్ని వివరాలను పంచుకుంటూ ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచారు. చిత్ర నిర్మాణం, విజువల్ ఎఫెక్ట్స్, కథ నేపథ్యం వంటి అంశాలపై చర్చించారు.

కార్యక్రమంలో భాగంగా ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రత్యేక బిహైండ్-ది-సీన్స్ వీడియోలను ప్రదర్శించారు. ఈ వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, సినిమా స్థాయి ఎంత భారీగా ఉంటుందో సూచించాయి. ముఖ్యంగా విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, సెట్ డిజైన్ వంటి అంశాలు హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయని అక్కడి ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

ఇక ఈ సినిమా కథ, నిర్మాణం గురించి అధికారిక వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడించకపోయినా, ఇది ఒక అడ్వెంచర్, మైథాలజీ, గ్లోబల్ థీమ్ కలిగిన ప్రాజెక్ట్‌గా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ బాబు కెరీర్‌లో ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావచ్చని అంచనాలు ఉన్నాయి.

‘వారణాసి’ సినిమా ప్రమోషన్లు అంతర్జాతీయ వేదికపై ప్రారంభమవడం తెలుగు సినిమాకు మరో గొప్ప గుర్తింపుగా భావించవచ్చు. రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు మరింత పెరుగుతుండగా, ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!