తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని దేవుడిని ప్రార్థించామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జరిగిన రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి ఉత్సాహంగా కార్యక్రమాన్ని వీక్షించారు.ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయం చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన స్వయంభు దేవాలయమని పేర్కొన్నారు. శ్రీరాముడు నడిగాడిన ప్రాంతంగా ఇది పేరుగాంచిందని తెలిపారు. వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయం నిర్మించబడిందని, అప్పటి నుంచి భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలుస్తోందని చెప్పారు.
ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణోత్సవం నుంచి రథోత్సవం వరకు ఈ ప్రాంత ప్రజలు భారీగా పాల్గొంటారని తెలిపారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగిస్తారని అన్నారు.ఆలయ అభివృద్ధిపై మాట్లాడిన ఆయన, గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పాత ఆలయానికి సౌకర్యాలు పెంచి, గొప్ప రథాన్ని నిర్మించామని చెప్పారు. ఆలయ ప్రాంగణాన్ని కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
ఇక్కడ వేలాది మంది వివాహాలు జరుపుకుంటారని, దైవిక కార్యక్రమాలకు అనుకూలంగా సదుపాయాలు కల్పించేందుకు రెండు పెద్ద షెడ్డులను నిర్మించామని వివరించారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసినట్లు తెలిపారు.రాబోయే రోజుల్లో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే వేలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చేలా ఆలయ యాజమాన్యం మరింత చొరవ తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని, ప్రజలకు మంచి జరగాలని దేవుడిని కోరుకున్నట్లు వెల్లడించారు.





