దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావం పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.
సామాజిక మాధ్యమ వేదిక X ద్వారా ప్రజలను ఉద్దేశించి స్పందించిన ప్రధాని, ఈ ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోజంతా తగినంత నీరు తాగాలని, శరీరంలో నీటి లోపం రాకుండా చూసుకోవాలని అన్నారు. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.
తీవ్రమైన వేడి పరిస్థితుల్లో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు, కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతారని మోదీ పేర్కొన్నారు. అలాంటి వారిపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. వృద్ధులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, వారికి నీరు, చల్లని వాతావరణం అందేలా చూడాలని తెలిపారు.
అంతేకాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలని, ఇళ్ల వద్ద, దుకాణాల వద్ద ఆరుబయట పక్షులు, జంతువుల కోసం నీటిని ఉంచాలని కోరారు. వేసవి కాలంలో నీటి కొరత కారణంగా పక్షులు, మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయని గుర్తు చేశారు.
వడదెబ్బ లక్షణాలను కూడా మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తల తిరగడం, వికారం, అధిక అలసట, శరీరం బలహీనపడటం వంటి లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. చుట్టూ ఉన్నవారిలో ఎవరైనా అకస్మాత్తుగా నీరసించినా, సృహ కోల్పోయినట్లు కనిపించినా వెంటనే వారిని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాలని సూచించారు.
ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని ప్రధాని పేర్కొన్నారు. అవసరమైతే వెంటనే వైద్య సహాయం అందించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు, పట్టణాల్లో కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్తలు మరింత అవసరమని అన్నారు.
ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత పెరుగుతోంది. వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అప్రమత్తత సూచనలు ఇస్తున్నాయి.
వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రధాని మోదీ చేసిన ఈ సూచనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రజలు కూడా తమ పరిసరాల్లో నీటి పాత్రలు ఉంచడం, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రభుత్వం, వైద్య నిపుణులు ఇస్తున్న సూచనలను పాటించడం ద్వారా వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.





