రాయలసీమను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి “రతనాల సీమ”గా మార్చడమే తమ ప్రభుత్వ అజెండా అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కడప జిల్లా టి.కోడూరు సమీపంలో సోలార్ పవర్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ కూడా పాల్గొన్నారు. సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ వేదికగా మాట్లాడిన లోకేశ్, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంపు, పరిశ్రమల ఆకర్షణ, ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై ప్రభుత్వ దృష్టిని వివరించారు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం ఇకపై పెట్టుబడులకు కేంద్రంగా మారబోతుందని ఆయన స్పష్టం చేశారు.
సోలార్ ప్రాజెక్టు వేగంగా పూర్తవడంపై స్పందించిన మంత్రి, కేవలం 11 నెలల కాలంలో ప్రాజెక్టు సాధ్యమవడం వెనుక రైతుల త్యాగాలు, సహకారం ఉన్నాయని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. జమ్మలమడుగు ప్రాంతం ఇప్పుడు రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన, ఈ ప్రాంతానికి రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. రాయలసీమను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు.
ఉపాధి కల్పన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అదే తమ “బ్రాండ్” అని లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలపై పరోక్ష విమర్శలు చేస్తూ, పరిశ్రమలను తరిమివేసే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. “విధ్వంసం చేయడం నిమిషం పని, కానీ నిర్మించడం ఎంతో కష్టం” అని వ్యాఖ్యానిస్తూ అభివృద్ధి ప్రక్రియకు సమయం, స్థిరత్వం అవసరమని వివరించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని చెప్పారు.
తిరుపతి ప్రాంతానికి రాయల్ ఎన్‌ఫీల్డ్, ఫైటర్ జెట్ తయారీ సంస్థలు రానున్నాయని లోకేశ్ వెల్లడించారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కీలక మలుపు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత పాలకులు పరిశ్రమలను రాష్ట్రం నుండి తరిమేశారని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడిదారులకు పూర్తి భరోసా ఇస్తోందని చెప్పారు. “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాన్ని అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి అన్ని సెక్టార్లలో సమతుల అభివృద్ధి సాధించడమే లక్ష్యమని చెప్పారు. జమ్మలమడుగు ప్రాంతం భవిష్యత్తులో కీలక ఆర్థిక కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సందర్శన
సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవ అనంతరం మంత్రి నారా లోకేశ్ ముద్దనూరు మండలం పెనికలపాడులోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. సేంద్రియ సాగు వైపు మళ్లడానికి గల కారణాలను ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారడంలో ఎదురైన సవాళ్లను రైతులు వివరించారు. రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను విస్తరించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని లోకేశ్ చెప్పారు. రైతులు సహజ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందగలరని ఆయన అభిప్రాయపడ్డారు. సమీకృత సేంద్రియ సాగు ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందుతున్న తీరు తనను ఆకట్టుకుందని మంత్రి పేర్కొన్నారు.
పెనికలపాడులో రైతు ద్వారకానాథ రెడ్డి కుటుంబం చేపట్టిన సమీకృత వ్యవసాయ పద్ధతులను మంత్రి పరిశీలించారు. 17 ఎకరాల భూమిలో మామిడి, బత్తాయి, ఉసిరి, కొబ్బరి, నిమ్మ, నేరేడు, జామ, మునగ, రామాఫలం, సీతాఫలం వంటి పంటలను సాగు చేయడాన్ని ఆయన ప్రశంసించారు. అదే విధంగా పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల సాగు వంటి అనుబంధ రంగాలను వ్యవసాయంతో అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం పెంచుకుంటున్న తీరు ఆయనకు నచ్చింది.





