తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ, సామాజిక వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుండగా, కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగ సందేశాలతో బాలకృష్ణపై తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా ఆయన అల్లుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారలోకేష్, కుమార్తె నారా బ్రహ్మిణీ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు అభిమానులను ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలు, ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని కొనియాడుతూ వారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నారా లోకేశ్ తన సోషల్ మీడియా సందేశంలో బాలకృష్ణను ప్రశంసిస్తూ, “నిండైన తెలుగుదనం, అభిమానం, భోళాతనానికి ప్రతిరూపం మా బాలా మావయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. అంతేకాకుండా బాలకృష్ణను అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ‘గాడ్ ఆఫ్ మాసెస్’గా అభివర్ణించారు. సినీ రంగంలోనే కాకుండా సమాజ సేవలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తూ అనేక మందికి ఆశాకిరణంగా మారారని పేర్కొన్నారు. “క్యాన్సర్ రోగులకు ఆపన్న హస్తంగా నిలిచే వ్యక్తి, హిందూపురం ప్రజల ప్రేమాభిమానాలు పొందిన ప్రజా విజేత బాలకృష్ణ ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అంటూ లోకేశ్ తన సందేశాన్ని ముగించారు.
బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కూడా తన తండ్రికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబానికి మార్గదర్శకుడిగా, అండగా నిలిచే వ్యక్తిగా బాలకృష్ణను ఆమె అభివర్ణించినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. తండ్రిగా, నాయకుడిగా, నటుడిగా ఆయన సాధించిన విజయాలు తమకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా ఉంటాయని పేర్కొన్నారు.బ్రాహ్మణి చేసిన పోస్టు కూడా అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంది. వేలాది మంది నెటిజన్లు ఆమె పోస్టుకు స్పందిస్తూ బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నందమూరి బాలకృష్ణ దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్నారు. యాక్షన్, ఫ్యామిలీ, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి.ప్రత్యేకంగా మాస్ ప్రేక్షకుల్లో బాలకృష్ణకు ఉన్న ఆదరణ అపారమైనది. అందుకే అభిమానులు ఆయనను ప్రేమగా ‘బాలయ్య’, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అని పిలుస్తుంటారు. ఇటీవల విడుదలైన చిత్రాలు కూడా మంచి విజయాలను నమోదు చేయడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.
సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా బాలకృష్ణ చురుకుగా వ్యవహరిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. ప్రజా ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు హిందూపురంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అందుకే లోకేశ్ తన సందేశంలో ఆయనను ‘ప్రజా విజేత’గా అభివర్ణించారు.
బాలకృష్ణ సేవా కార్యక్రమాల్లో అత్యంత ప్రాధాన్యం పొందింది బసవతారకం ఇండో అమెరికాన్ క్యాన్సర్ హస్సీటల్ అండ్ రిసేచ్ ఇన్సిటిట్యూట్. క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.ఆసుపత్రి కార్యకలాపాల్లో బాలకృష్ణ చురుకుగా పాల్గొంటూ రోగులకు ధైర్యం చెప్పడం, అవసరమైన సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ కారణంగానే ఆయనను అనేక మంది ‘ఆపన్న హస్తం’గా అభివర్ణిస్తుంటారు.
బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అభిమాన సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేక్ కటింగ్‌లు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా హ్యప్పీ బర్త్ బాలకృష్ణ, వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నిలిచాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.





