మేడ్చల్ జిల్లా పరిధిలోని పోచారం ఐటీ కారిడార్లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ, వివాహం నేపథ్యంలో జరిగిన పరిణామాలు ఒక యువతి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ప్రియుడి చర్యల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనగామ జిల్లాకు చెందిన మనోహర్ (24) అనే యువకుడు తన బంధువైన 20 ఏళ్ల యువతితో చిన్నప్పటి నుంచే ప్రేమలో ఉన్నాడు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి వివాహం కూడా నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా, అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
వివాహానికి ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మనోహర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. అతని తల్లిదండ్రులు కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై, వెంటనే పెళ్లిని రద్దు చేసుకున్నారు.
ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోయిన మనోహర్ తీవ్ర ఆవేశానికి గురై, యువతిపై ప్రతీకార భావంతో అమానుష చర్యకు పాల్పడ్డాడు. గత నెల 11న, సిరంజిలో తన రక్తాన్ని నింపుకుని యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ఆ రక్తాన్ని సిరంజి ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించి పరారయ్యాడు. ఈ సంఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. దీంతో యువతి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన తర్వాత యువతి తీవ్ర మనస్తాపానికి లోనై, జీవితంపై ఆశలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు పెళ్లి సమయంలో ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన మనోహర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రేమ పెళ్లి సంబంధాలల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.





