మావోయిస్టు అగ్రనేత రాదక్క మృతి..

Must read

మావోయిస్టు అగ్రనేత మోతిబాయి అలియాస్ రాదక్క (65) సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవల రిమ్స్‌లో చేరారు.

ఆదిలాబాద్ మండలం పిప్పల్‌ధారి గ్రామానికి చెందిన రాదక్క, జిల్లాలో పీపుల్స్ వార్ ఉద్యమం ఉధృతంగా సాగిన కాలంలో తొలితరం నేతల్లో ఒకరు. గ్రామంలో భూస్వామ్య శక్తుల ఆగడాలను భరించలేక ఎదిరించి, మొదట శంకరన్న నాయకత్వంలో పిప్పల్‌ధారి దళంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఇంద్రవెల్లి దళ కమాండర్, మంగి ఏరియా కార్యదర్శి, ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. తెలంగాణలో పార్టీపై నిర్బంధం పెరగడంతో ఆమెను దండకారణ్యానికి మార్చి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా నియమించినట్లు తెలుస్తోంది.

ఇంద్రవెల్లి దళం, మంగి ఏరియాలో కమాండర్‌గా పనిచేసిన క్రమంలో, ఆదిలాబాద్ జిల్లా పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా ఉన్న పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్నను ఆమె పెళ్లి చేసుకుంది. అతను ఇటీవల సెంట్రల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తూ ఆయుధాలు వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాదక్క గతంలో ఆదిలాబాద్ జిల్లా పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కరీంనగర్ జిల్లా రంగారావుపేటకు చెందిన వెల్లంకి అరుణ అలియాస్ లలితక్కతో కలిసి సహచరురాలిగా పనిచేశారు. లలితక్క బెజ్జూరు మండలం ఆగర్గూడ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురితో కలిసి మరణించగా, రాదక్క అంతకుముందే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా వెళ్లిపోయారు.

పీపుల్స్ వార్ ఉద్యమం వివిధ దశలను దాటుతూ ముందుకు సాగిన సమయంలో రాదక్క కూడా పార్టీతోనే కొనసాగారు. అనంతరం పీపుల్స్ వార్, ఇతర నక్సలైట్ సంస్థల విలీనం ద్వారా మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత ఆమెకు మరింత కీలక బాధ్యతలు లభించాయి. మావోయిస్టు పార్టీ ఏర్పాటైన తరువాత ఆమెను ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా నియమించినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యత పార్టీలో ఆమెకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందని అప్పటి ఉద్యమ పరిణామాలను పరిశీలించిన వారు చెబుతున్నారు.

తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు పార్టీపై పోలీసుల నిర్బంధం, కూంబింగ్ కార్యకలాపాలు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లు తదితర పరిణామాలు తీవ్రతరం కావడంతో పలువురు కీలక నేతలు అటవీ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో రాదక్కను కూడా తెలంగాణ నుంచి దండకారణ్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అక్కడ ఆమె స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా కొనసాగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రారంభమైన ఆమె ఉద్యమ ప్రస్థానం అనంతరం ఛత్తీస్‌గఢ్‌తో పాటు దండకారణ్య ప్రాంతాల వరకు కొనసాగిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

రాదక్క సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమంలో కొనసాగినప్పటికీ, గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. వయసు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఆమెకు వైద్య చికిత్స అవసరమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం కన్నుమూశారు. సుమారు 65 ఏళ్ల వయసులో ఆమె మరణించారు.

రాదక్క మృతితో ఆమె స్వగ్రామం పిప్పల్‌ధారిలో విషాద వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒక సాధారణ గ్రామీణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి కీలక స్థాయికి ఎదగడం అప్పటి ఆదిలాబాద్ ప్రాంత చరిత్రలో ఒక ప్రత్యేక పరిణామంగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, సామాజిక అసమానతలు, భూస్వామ్య వ్యవస్థపై వ్యతిరేకత వంటి అంశాలు అప్పట్లో అనేక మంది యువతను వామపక్ష తీవ్రవాద ఉద్యమాల వైపు ఆకర్షించాయి. రాదక్క కూడా అదే పరిస్థితుల్లో ఉద్యమంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

గత ఐదేళ్ల క్రితం దంతేవాడ ప్రాంతం నుంచి కుంట జిల్లా మీదుగా ఖమ్మం ఆసుపత్రికి చికిత్స కోసం వస్తుండగా ఖమ్మం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఆమె తర్వాత సాధారణ జీవితం గడిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం కాలనీలో నివసిస్తున్నారు. ఇటీవల చంద్రన్న లొంగిపోవడంతో రామగుండంలో ఉన్న ఆయనతో కొంతకాలం ఉన్నట్లు తెలిసింది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని గ్రామం నుంచి మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన రాదక్క మరణం పట్ల పలు విప్లవ సంఘాల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!