భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవితాన్ని సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీ రాజ్ ఇకలేరు. 84 ఏళ్ల వయసులో ఆయన బుధవారం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భారతీరాజా మరణవార్త తమిళ సినీ పరిశ్రమను మాత్రమే కాకుండా యావత్ భారత సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతి తమిళ సినిమాకు ఒక శకం ముగిసినట్లేనని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
తమిళ చిత్రసీమలో “ఇయక్కునర్ ఇమయం” (దర్శకుల శిఖరం)గా పేరొందిన భారతీరాజా, గ్రామీణ నేపథ్య కథలను వాస్తవికతతో తెరపై చూపించి సినీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా గ్రామీణ సంస్కృతి, మానవ సంబంధాలు, భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబించాయి. తమిళ సినిమాను స్టూడియోల గోడల నుంచి బయటకు తీసుకువచ్చి పల్లెలు, పొలాలు, ప్రకృతి మధ్య చిత్రీకరణకు కొత్త దిశను చూపిన దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
1977లో విడుదలైన ఆయన తొలి చిత్రం ’16 వయతినిలే’ తమిళ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం ద్వారా గ్రామీణ జీవితాన్ని నిజాయితీగా చూపించడంతో పాటు కొత్త తరహా కథన శైలికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన కిళక్కే పోగుమ్ రైల్, సిగప్పు రోజాక్కళ్, ముదల్ మరియాదై, వేదం పుదిదు వంటి చిత్రాలతో కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాలను సున్నితంగా తెరకెక్కించారు. తెలుగులో ఆయన తీసిన ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ వంటి వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా భారతీరాజా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన సహజ నటనతో పలు చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో అనేక మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. తమిళ సినిమాకు కొత్త తరం ప్రతిభను అందించిన దర్శకుడిగా కూడా ఆయనకు విశేష గౌరవం ఉంది.
భారతీరాజా వ్యక్తిగత జీవితం కూడా గత కొంతకాలంగా విషాదంతో నిండిపోయింది. ఆయన భార్య చంద్రలీలావతి, కుమార్తె జనని కుటుంబ సభ్యులుగా ఉన్నారు. అయితే గత ఏడాది మార్చిలో ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతి రాజ్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం భారతీరాజాను తీవ్రంగా కలచివేసింది. పుత్రశోకం నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేకపోయారని కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. కుమారుడి మరణం తర్వాత ఆయన మానసికంగా కుంగిపోయారని, ఆరోగ్య పరిస్థితి కూడా క్రమంగా దిగజారిందని సమాచారం.
ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన అనేకసార్లు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ ఏడాది ప్రారంభంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా చెన్నైలోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో పాటు వయోభారానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఆయనను ఇబ్బంది పెట్టినట్లు వైద్య నివేదికలు సూచించాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడినప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోయారు.
భారతీరాజా మరణవార్త వెలువడగానే తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు నటీనటులు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు ప్రకటిస్తున్నారు. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతున్నారు. ఆయన చిత్రాలు తరతరాల సినీ అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొంటున్నారు.





