పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో ఉన్న 136 ఏళ్ల చారిత్రక గౌరీపూర్ జామా మసీదు చుట్టూ వివాదం చెలరేగింది. విమానాశ్రయ భద్రత, విస్తరణ అవసరాల నేపథ్యంలో మసీదును వేరే ప్రాంతానికి తరలించే (రీలొకేషన్) ప్రతిపాదనలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మసీదు కమిటీ, జమియా ఉలేమా-ఏ-హింద్ సంయుక్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న గౌరీపూర్ జామా మసీదు చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రార్థనా స్థలంగా గుర్తింపు పొందింది. ఇటీవల భద్రతా కారణాలను చూపుతూ సాధారణ భక్తుల ప్రవేశంపై అధికారులు పరిమితులు విధించినట్లు సమాచారం. అదే సమయంలో మసీదును మరో ప్రాంతానికి తరలించే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో స్థానిక ముస్లిం సంఘాలు, మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మసీదు కమిటీ, జమియా ఉలేమా-ఏ-హింద్ సంయుక్తంగా శుక్రవారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ప్రార్థనల అనంతరం భారీ ఎత్తున శాంతియుత నిరసన నిర్వహించాలని నిర్ణయించగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
విమానాశ్రయం భద్రతకు అత్యంత కీలకంగా భావించే గేట్ నంబర్-7, బాంక్రా క్రాసింగ్ తదితర ప్రాంతాల్లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలు చేశారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడకుండా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలను అమలు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించబడ్డాయి.
నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి నేతృత్వం వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని నమాజ్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ర్యాపిడ్ యాక్షన్ బృందాలు, ప్రత్యేక పోలీసు దళాలు, వాటర్ కానన్లు సిద్ధంగా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగినప్పటికీ, అనంతరం సిద్ధిఖుల్లా చౌదరి పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం భక్తులు సమీపంలోని మరో ప్రాంతంలో ప్రార్థనలు నిర్వహించారు. దీంతో పెద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పరిస్థితి అదుపులోకి వచ్చింది.





