మహిళా రిజర్వేషన్‌కు బీఆర్‌ఎస్ మద్దతు

Must read

జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులతో సమావేశమైన్నారు. ఈ సందర్బంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా సమగ్ర చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు భవిష్యత్తులో దేశ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తూ, పార్టీ వ్యూహాన్ని ముందుగానే సిద్ధం చేయాలని కేసీఆర్ సూచించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్‌ఎస్ తన స్పష్టమైన మద్దతు ప్రకటించింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లుకు తమ పార్టీ పూర్తిగా అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం అవసరమని, ఇది సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ఈ అంశంపై తమ పార్టీ చట్టసభలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇక నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై మాత్రం కేసీఆర్ కఠిన వైఖరిని ప్రదర్శించారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే, జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సీట్ల సంఖ్య పెరిగినా, దక్షిణ రాష్ట్రాల వాటా తగ్గకూడదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీకి కూడా తావు లేదని కేంద్రానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

రాజకీయ అంశాలతో పాటు పార్టీ సంస్థాగత కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పార్టీ బలోపేతానికి రాబోయే కార్యక్రమాలు కీలకమని భావిస్తూ, వాటిని విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!