మాట తప్పితే.. రాళ్లతో కొట్టండి :కవిత

Must read

రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టటంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమయ్యిందంటూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. ఫీజుల దోపిడీ నియంత్రణకు ఈ నెలలోనే చట్టం తేవాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో ఆమె పాల్గొన్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అవినీతి పై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కే కుట్రలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే ప్రైవేట్ విద్య సంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రే మన విద్యాశాఖ మంత్రి కావటం ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాల్సిందేనన్నారు. ఫీజు నియంత్రణ కోసం తక్షణమే చట్టం చేయాల్సిందేనని అన్నారు. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు పెంపు లేకుండా జీవో జారీ చేయాలన్నారు. ఫీజుల పెంపు కారణంగా తల్లితండ్రులకు మే నెల పీడకల మాదిరిగా తయారైందన్నారు.

తెలంగాణలో విద్య, వైద్యం కోసమే 60 నుంచి 70 శాతం వరకు వారి ఆదాయాన్ని ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తమ పిల్లలను బాగా చదివించాలన్న తల్లితండ్రుల వీక్ నెస్ ను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ సంస్థలు అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నాయన్నారు.

రాష్ట్రంలో ప్రతి ప్రైవేట్ స్కూల్ లో దాదాపు 50 నుంచి 120 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. త్వరలోనే తమతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని చెప్పారు. తాము కొత్తగా ఏమీ అడగటం లేదని…రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఇచ్చిన హామీలనే అడుగుతున్నామన్నారు.

ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టకపోగా…ఫీజు రీయింబర్స్ మెంట్ ను కూడా బొందపెట్టే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తోందని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎంఎస్-7 జీవో తో ఫీజు రీయింబర్స్ మెంట్ కు మంగళం పాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పిల్లల అకౌంట్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ వేస్తామంటూ జీవో లో పేర్కొన్నారని కవిత చెప్పారు. ఫీజు అకౌంట్ లో వేయకపోయిన సరే పిల్లల తల్లితండ్రులు ఉద్యమం చేయరన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పనిచేస్తుందన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్​ చేశారు.
విద్య, వైద్యం కోసమే తెలంగాణలో ప్రతి కుటుంబం 70 శాతం ఖర్చు చేసే పరిస్థితి ఉందని కవిత అన్నారు. 1200 మంది అమరుల ప్రాణ త్యాగం చేసి…ఎంతో మంది విద్యార్థులు లాఠీ దెబ్బలు తిని రాష్ట్రాన్ని సాధించారని కవిత గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక సంవేదనతో పాలన చేయాల్సి ఉండేనని చెప్పారు. కానీ ఆ పని జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ కోసం తిరుపతి రావు కమిషన్ వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం…ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు.

తెలంగాణ రక్షణ సేన (TRS) అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో కూడా పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని మరోసారి తేల్చి చెప్పారు. తాను ఇచ్చిన మాటను తప్పితే అమరుల స్థూపం స్తంభానికి క్టటేసి రాళ్లతో కొట్టాలన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!