ఈసారి వర్షాలు తక్కువే :ఐఎండీ తొలి అంచనా

Must read

రైతులు ఎంతో ఆశగా ఎదురు చూసే 2026 నైరుతి రుతుపవనాలపై (ఐఎండీ) తన తొలి విడత అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

ఐఎండీ వివరాల ప్రకారం, ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే కొంత తక్కువగా ఉండే అవకాశముందని సూచించింది. దీర్ఘకాలిక సగటు (LPA)తో పోలిస్తే సుమారు 90 నుంచి 95 శాతం మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా సగటున 92 శాతం వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. అయితే ఈ అంచనాల్లో సుమారు 5 శాతం వరకు మార్పులు ఉండవచ్చని కూడా స్పష్టం చేసింది.

వర్షపాతం అంచనాలను నిర్ణయించడంలో ఐఎండీ అనేక శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, గాలి పీడన వ్యవస్థలు వంటి అంశాలను విశ్లేషించి ఈ అంచనాలను రూపొందిస్తుంది.

1971 నుంచి 2020 వరకు సేకరించిన వర్షపాత డేటా ఆధారంగా దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉంది. ఈ గణాంకాల ఆధారంగానే ప్రతి సంవత్సరం అంచనాలు రూపొందించబడుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్న అంచనాలు రైతుల్లో కొంత ఆందోళనకు దారితీస్తున్నాయి.

ఐఎండీ అధికారులు ఈ అంచనాలు ప్రాథమికమైనవేనని, మరింత ఖచ్చితమైన వివరాలు మే నెల చివరి వారంలో విడుదల చేస్తామన్నారు. రుతుపవనాల కదలికలు, సముద్ర పరిస్థితులు, ఎల్‌నినో లేదా లా నినా వంటి వాతావరణ ప్రభావాలను విశ్లేషించి సవరించిన అంచనాలను ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.

దీనిపై ప్రభుత్వ,వసాయ శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి సంరక్షణ, పంటల ఎంపిక, ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం అవసరమన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ అంచనాలు కేవలం దేశవ్యాప్తంగా సగటు పరిస్థితులను మాత్రమే సూచిస్తాయని, ప్రాంతాల వారీగా వర్షపాతం మారవచ్చన్నారు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!