హైదరాబాద్ జలమండలిలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి ప్రాజెక్టు డివిజన్–3 జీఎం (ఇంజినీరింగ్) సగ్గం అనంత లక్ష్మి కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఏసీబీ హైదరాబాద్ సీఐయూ విభాగం డీఎస్పీ మాజిద్‌ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామునే మల్లాపూర్ వెంకటరమణ కాలనీలోని ఆయన నివాసంపై దాడులు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఈ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండి వస్తువులు గుర్తించినట్లు సమాచారం. లెక్కింపు యంత్రాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడినట్లు వెల్లడించారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.5.88 కోట్లుగా గుర్తించగా, బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సీజ్ చేసిన ఆస్తుల జాబితాలో రూ.1.10 కోట్లు నగదు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు, సంగారెడ్డి–నిజామాబాద్ జిల్లాల్లో 18 ఎకరాల భూమి, హైదరాబాద్‌లో 6 ఇళ్ల స్థలాలు, ఒక ఖరీదైన ఇల్లు, అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం. అదనంగా మారుతి రిట్జ్ కారు, బజాజ్ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసుతో జలమండలిలో అవినీతి వ్యవహారాలపై మరోసారి చర్చ మొదలైంది. ఏసీబీ అధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.





