నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటైన ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వాహనాల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ మార్గంలో ప్రయాణం భారంగా మారింది. ముఖ్యంగా కార్యాలయ సమయాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుంది. దీంతో ఉద్యోగస్తులు, స్కూల్ పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడమే కాకుండా, అదే మార్గంలో ఫ్లైఓవర్‌ను కూడా కలిపి ‘డబుల్ డెక్కర్’ విధానంలో నిర్మించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే, పైభాగంలో మెట్రో రైలు, దిగువ భాగంలో ఫ్లైఓవర్ ఉండేలా నిర్మాణం జరుగుతుంది. దీని వల్ల రహదారిపై వాహనాల ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశముంది. దీంతొ ప్రజలకు కాస్త ఊరట లభిస్తున్నట్టే.
ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో నిర్మాణానికి సంబంధించి ఒక డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న డబుల్ డెక్కర్ ప్రణాళిక మరింత సమర్థవంతంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, పాత డీపీఆర్‌ను పక్కనపెట్టి కొత్త ప్రణాళికకే ఆమోదం ఇవ్వాలని కోరుతోంది.
ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, నగర ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో డబుల్ డెక్కర్ విధానం విజయవంతంగా అమలు అవుతోంది. ఒకే మార్గంలో రెండు రకాల రవాణా సదుపాయాలను కల్పించడం ద్వారా స్థల వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించవచ్చు.
నగరంలో డబుల్ డెక్కర్ ప్రణాళిక అమలులోకి వస్తే, ఎల్బీనగర్–హయత్‌నగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, కాలుష్యం కూడా తగ్గే అవకాశముందని, అదనంగా, ప్రజలకు సౌకర్యవంతమైన, వేగవంతమైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు.
ఈ ప్రాజెక్ట్ అమలుకు భారీ వ్యయం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామని. భూసేకరణ, నిర్మాణ పనులు, సాంకేతిక అంశాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ట్రాఫిక్ సమస్యల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.





