తెలంగాణ రాజకీయాల్లో రైతు సమస్యలపై మరోసారి చర్చ వేడెక్కింది. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే టీ. హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు బహిరంగ లేఖ రాస్తూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పంటల కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన లేఖలో ప్రస్తావించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ను హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల ముందు చెప్పిన హామీలు అమలు కావడం లేదని, అది పూర్తిగా బోగస్‌గా మారిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున వరి ధాన్యం చేరుతున్నప్పటికీ, ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఎండల్లో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడుతున్న కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు.
ప్రతి బస్తాకు ఒకటి, రెండు కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో తాలు పేరిట తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు స్వయంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు.
రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఎండల్లో వారు మాడిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతులకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ బోనస్ రైతులకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు.





