విశాఖపట్నం అంటే మనకి స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది, బీచ్ గుర్తొస్తుంది, కానీ ఇక నుండి విశాఖపట్నం అంటే ఏఐ డేటా హబ్… గ్లోబల్ ఐటీ హబ్ గా పిలవబడుతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ సమీపాన తర్లువాడ వద్ద ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గూగుల్ ఏఐ హబ్ తో విశాఖ ముఖచిత్రం మారబోతోంది.
ఇది ఒక భూమిపూజ కాదు… భవిష్యత్తుకి పునాది, ఇది ప్రాజెక్ట్ కాదు ఒక జనరేషన్‌ని మార్చే మూవ్మెంట్. ఆంధ్రప్రదేశ్ రైజింగ్ – ఇండియా లీడింగ్ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. కేంద్ర మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ భారతదేశ డిజిటల్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవాన్ని అసాధారణ వేగం, స్పష్టతతో నడిపిన డైనమిక్ లీడర్ అని కొనియాడారు. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పట్టాలెక్కించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గూగుల్, అదానీ గ్రూప్, భారతి ఎయిర్టెల్ సంస్థ లీడర్లు, భారత ప్రభుత్వ అధికారులు, ప్రతిష్ఠాత్మక ఇండస్ట్రీ పార్టనర్లు, విశాఖ యువత, ఉత్తరాంధ్ర ప్రజలకు, గూగుల్ కోసం భూములు ఇచ్చిన రైతులకు మంత్రి అభినందనలు తెలిపారు.
28 ఏప్రిల్ 2026… సరికొత్త చరిత్రకు పునాది. ఈ తేదీ రాసి పెట్టుకోండి. విశాఖపట్నం పేరు ఇకపై ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇక నుండి ఒక లెక్క. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ సిటీ… ఇక నుండి విశాఖ ఏఐ డేటా హబ్. ఇప్పటి వరకు గూగుల్‌లో విశాఖపట్నం గురించి సెర్చ్ చేశారు. ఇక నుండి గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో విశాఖపట్నం ఉంటుంది. వైజాగ్ లో ‘జి’ అంటే గూగుల్ అని గట్టిగా చెప్పాలి, వైజాగ్‌లో సౌండ్ చేస్తే దేశం మొత్తం వినిపించాలి. గూగుల్ రాకుండా అడ్డుకోవడానికి కేసులు వేసిన బ్యాచ్‌కి వినిపించాలి.
రాష్ట్రంలో 5ఏళ్లపాటు విధ్వంస పాలన జరిగింది. ఒక్క కంపెనీ రాలేదు. ఉన్న కంపెనీలను తరిమేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగిన కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. 2024లో ఒక ప్రభంజనం వచ్చింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర… స్టేట్ మొత్తం క్లీన్ స్వీప్. 94% స్ట్రైక్ రేట్‌తో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు నుండే పెట్టుబడుల కోసం పరిగెత్తాం. అన్ని దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్‌ని ప్రమోట్ చేశాం.
అప్పుడు ఇన్వెస్టర్లు అడిగిన మాట మేము ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు రావాలి అని. ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న మూడు యూనిక్ పాయింట్ల గురించి వాళ్లకు చెప్పాను. మొదటిది బ్రాండ్ సీబీఎన్. ప్రపంచంలో ఏ కంపెనీ వద్దకు వెళ్లినా మన బ్రాండ్ సీబీఎన్ పేరు చెప్పగానే డోర్స్ ఓపెన్ అవుతాయి. సైబరాబాద్ కట్టిన హిస్టరీ మన బ్రాండ్‌కి ఉంది. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి గేర్ మార్చాం. మూడవది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్.
భారత్, ఆంధ్రప్రదేశ్ పై నమ్మకంతో వచ్చిన గూగుల్ సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఎనేబుల్ చేయడంలో కీలకపాత్ర వహించిన అదానీ గ్రూప్‌కి, భారతీ ఎయిర్‌టెల్‌కి అభినందనలు, మా గ్రోత్ స్టోరీలో స్ట్రాంగ్ పార్ట్నర్గా ఉన్నందుకు విశాఖపట్నం ప్రజలకు కృతజ్ఞతలు. మీ సపోర్ట్, బిలీఫ్, స్పిరిట్ లేకుండా ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు నమస్సుమాంజలి. మీ త్యాగం, నమ్మకం ఈ చారిత్రాత్మక ట్రాన్స్‌ఫర్మేషన్‌కి నిజమైన ఫౌండేషన్ అని మంత్రి లోకేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇతర కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, కే.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, గూగుల్ క్లౌడ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే, భారతి ఎంటర్ ప్రైజెస్ వైస్ ఛైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ ఛైర్మన్ జీత్ అదానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ ప్రీతి లొబానా, అదానీ గ్రూప్ డైరెక్టర్ కరణ్ అదానీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.





