హుజురాబాద్ డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా పోరాటం.. ఈటల రాజేందర్ మద్దతు

Must read

హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ఉద్యమకారులతో ఐక్యత ప్రకటించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, హుజురాబాద్‌లో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని విషతుల్యంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, పరిసర గ్రామాల వారు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

“నాకు యాక్షన్ రాదు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే వస్తుంది” అంటూ ఆయన తన శైలిలో వ్యాఖ్యానించారు. దీక్ష జరుగుతోందని తెలిసిన వెంటనే తాను తప్పకుండా హాజరవుతానని నిర్ణయించుకుని వచ్చినట్లు చెప్పారు. తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని, ప్రజల సమస్యల కోసం మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు.డంపింగ్ యార్డుల వల్ల కలిగే ప్రమాదాలపై మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత దుర్మార్గమైన ఘటనలలో ఒకటిగా జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ను పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులను తాను ప్రత్యక్షంగా చూసిన సాక్షినని చెప్పారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, కాలుష్యం కారణంగా జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని వివరించారు.

హుజురాబాద్‌లో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. డంప్ యార్డ్ పేరుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెబుతున్నప్పటికీ, ఆ యంత్రాలు సరిగా పనిచేయవని అన్నారు. భూగర్భ జలాలు కలుషితమవడం, చెరువులు నాశనం కావడం, గాలిలో కాలుష్యం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.ఇలాంటి ప్రాజెక్టుల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయని పేర్కొన్నారు. “ఇది కేవలం చెత్త సమస్య కాదు.. ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రమాదకర నిర్ణయం” అని ఆయన అన్నారు.

డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా గతంలో కూడా తాను ఉద్యమాలు చేపట్టినట్లు, ఎంపీ అయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు కూడా వేసినట్లు వెల్లడించారు. త్వరలోనే పార్లమెంట్ సభ్యుల బృందంతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. “అప్పిస్మెంట్ కాదు.. ఆచరణ కావాలి” అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే ఈ ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!