మేధావుల్లారా.. మీ మౌనం సమాజానికి అరిష్టం :బండి సంజయ్

Must read

డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు.’’అని అన్నారు.

సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.

‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా.’’అని పిలుపునిచ్చారు.

రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని శుభమంగళ కన్వెన్షన్ లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సదస్సులో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేధావులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.

అంబేద్కర్ బీజేపీ నాయకుడు కాదు. అయినా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను, ఆయన ఆలోచనా విధనాలను, ఆశయాలను గల్లీగల్లీకి తీసుకెళ్లాలని బీజేపీ ఎందుకు అనుకుంటోంది? ఎందుకంటే అణగారిన వర్గాల ప్రజల వెలుగు రేఖ అంబేద్కర్. అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మేధావి. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి. అలుపెరగని పోరాటానికి మరో రూపం అంబేడ్కర్​ అన్నారు.

సమాజంలోని అట్టడుగు వర్గాల సమానత్వం, స్వేచ్ఛ, హక్కులకు సజీవ స్వరూపం. యావత్ ప్రపంచంలోని అణగారినవర్గాల ఆత్మగౌరవ సూచిక అంబేద్కర్ అంటూ ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందంటే బాబాసాహెబ్ ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవాలి బండి సంజయ్​ గుర్తు చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!