ఆశా భోస్లే కన్నుమూత

Must read

భారత సంగీత ప్రపంచాన్ని తన గాత్రంతో మంత్ర ముగ్ధులను చేసిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఇక లేరు. 92 ఏళ్ల వయసులో ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిట‌ల్‌ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను శనివారం ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రమైన అలసటతో పాటు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు పేర్కొన్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి మరింత విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. ఈ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా సినీ, సంగీత రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆశా భోస్లే తన గాత్రంతో అనేక తరాలను అలరించిన అపూర్వ గాయని. ఆమె స్వరం ప్రత్యేకత, భావ వ్యక్తీకరణలో ఉన్న లోతు వల్లే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించారు. హిందీ సినీ సంగీతానికి ఆమె చేసిన సేవలు అమోఘం.

పాప్, ఘజల్, క్లాసికల్, ఫోక్ వంటి విభిన్న శైలుల్లో పాటలు పాడుతూ తన ప్రతిభను చాటుకున్నారు.తన సుదీర్ఘ గాన ప్రయాణంలో ఆమె ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. ముఖ్యంగా బ‌ప్పి ల‌హ‌రి, ఇల‌య‌రాజ‌, ఏఆర్ రెహ‌మాన్‌ వంటి దిగ్గజాలతో కలిసి ఎన్నో మధుర గీతాలను అందించారు. ప్రతి తరానికి తగినట్లు తన గానాన్ని మార్చుకుంటూ, కొత్తదనాన్ని జోడించడం ఆమె ప్రత్యేకతగా నిలిచింది.

ఆశా భోస్లే దాదాపు 20కి పైగా భాషల్లో పాటలు పాడారు. హిందీ, మరాఠీతో పాటు తమిళ్, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, ఒడియా వంటి భాషల్లో ఆమె గానం వినిపించింది. ప్రతి భాషలోనూ తన గాత్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగు సినీ రంగంలో ఆమె గాత్రం తక్కువగానే వినిపించినప్పటికీ, పాడిన పాటలు మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించాయి. పాలు నీళ్లు చిత్రంలోని “ఇది మౌన గీతం” పాటతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే చిన్న కృష్ణుడులో “జీవితం సప్తసాగరం” పాటను ఎస్పీబీతో కలిసి ఆలపించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!