పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సోనార్పూర్ ప్రాంతంలో ఎన్నికల అనంతర హింసకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో స్థానికులు ఆయనను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో అభిషేక్ బెనర్జీ గాయపడగా, అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
సోనార్పూర్లోని కమ్రాబాద్ ప్రాంతంలో ఎన్నికల అనంతర హింసలో బాధితుడైన సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ పర్యటించారు. ఆయన ఆ ప్రాంతానికి వస్తున్న విషయం ముందుగానే తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వందలాది మంది ప్రజలు గుంపులుగా చేరి ఆయన రాక కోసం ఎదురుచూశారు. అభిషేక్ అక్కడికి చేరుకున్న వెంటనే కొందరు ఆందోళనకారులు ఆయనను చుట్టుముట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.
నిరసనకారులు ‘చోర్ చోర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు కూడా నిరసనల్లో పాల్గొని చీపుర్లు, వెదురు కర్రలు చేతబట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపటికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి, కొందరు వ్యక్తులు అభిషేక్ బెనర్జీ వైపు రాళ్లు, గుడ్లు, చెప్పులు విసిరినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
ఈ తోపులాటలో అభిషేక్ బెనర్జీ ధరించిన చొక్కా చిరిగిపోయినట్లు, ఆయన కళ్లద్దాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ అందించి రక్షణ కల్పించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ఆందోళనకారుల మధ్య నుంచి ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
దాడిలో గాయపడిన అభిషేక్ బెనర్జీని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిశీలన నిమిత్తం ఇంటెన్సివ్ థెరపీ యూనిట్ (ఐటీయూ)లో ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని, ఇది ముందస్తుగా పన్నిన రాజకీయ కుట్ర అని పార్టీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా ఈ ఘటన వెనుక భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రేరేపణ ఉందని టీఎంసీ పేర్కొంది. ప్రజలను రెచ్చగొట్టి తమ నేతపై దాడి చేయించారని ఆరోపిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
జేపీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. టీఎంసీ పాలనపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి, ఆగ్రహం కారణంగానే ఈ నిరసనలు జరిగాయని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే స్థానికులు నిరసన వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.





