గోదావరి నదికి వరదలు వచ్చిన ప్రతిసారి బాధితుల సమస్యలను పరిష్కరించడం పక్కనబెట్టి, కేవలం రాజకీయ ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ నుంచి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా వాస్తవాలను వక్రీకరించడమేనని విమర్శించారు. సాగునీటి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో కనీస జ్ఞానం కూడా లేకుండా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, వారి అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు మళ్లీ బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ మరియు పంపింగ్ ప్రక్రియలు అనేవి రాజకీయ సభల్లో చేసే మైకు ప్రకటనలతో సాధ్యమయ్యేవి కావని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జలాశయాల్లోని నీటి మట్టాలు, మోటార్ల పంపింగ్ సామర్థ్యం, ప్రధాన కాలువల నీటిని మోయగల పరిమితి, దిగువన ఉండే ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం, విద్యుత్ లభ్యతతో పాటు నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సాంకేతిక అనుమతులు, భద్రతా ప్రమాణాల ఆధారంగానే నీటి విడుదల నిర్ణయాలు జరుగుతాయని వివరించారు.
ఈ కనీస ధర్మాలు తెలియకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయమన్నారు.ప్రజాధనంతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఎంతమాత్రం లేదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితమైన వేల కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నేడు గుల్లై, కూలిపోయే స్థితికి ఎందుకు చేరిందో ముందుగా ఆ పార్టీ నాయకులే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో జరిగిన ఘోరమైన లోపాలు, డిజైన్ వైఫల్యాల వల్ల రాష్ట్ర ఖజానాపై పడిన భారీ భారం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు పేరు చెప్పి ప్రజలను మళ్లీ తప్పుదోవ పట్టించాలని చూడటం వారి రాజకీయ దివాళాకోరుతనానికి అద్దం పడుతోందన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారా నీటిని తరలించే అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయని మంత్రి అడ్లూరి అన్నారు. ప్రాజెక్టుల రూపకల్పన, భౌగోళిక పరిస్థితుల ప్రకారం ఎక్కడ గ్రావిటీ సాధ్యమవుతుందో అక్కడ గ్రావిటీ ద్వారా, ఎక్కడ సాంకేతికంగా అవసరమో అక్కడ ఎత్తిపోతల (లిఫ్ట్) ద్వారా ನೀటి తరలింపు జరుగుతుందని, ఇది పూర్తిగా ఇంజనీరింగ్ సాంకేతిక అంశమని స్పష్టం చేశారు.
గతంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన బీఆర్ఎస్, తన పదేళ్ల సుదీర్ఘ పాలనలో ఆ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలని సవాలు విసిరారు.తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు నిరంతర సాగునీరు, ప్రజలకు సరిపడా తాగునీరు అందించేందుకు పూర్తి శాస్త్రీయ విధానంలో ప్రాజెక్టుల నిర్వహణ చేపడుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రచారాల కోసం కాకుండా, జలవనరుల నిపుణుల సలహాలు, సాగునీటి శాఖ ఇంజినీర్ల సాంకేతిక సూచనలు, భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ప్రతి నిర్ణయాన్ని అమలు చేస్తోందని వెల్లడించారు. బీఆర్ఎస్ లాగా ప్రజాధనాన్ని నీళ్లపాలు చేసే అలవాటు కాంగ్రెస్కు లేదన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ పలు ప్రశ్నలు సంధించారు. మేడిగడ్డ బ్యారేజీ నేడు కుంగిపోయి ఈ దుస్థితికి రావడానికి అసలు బాధ్యులు ఎవరు?, నిర్మాణ నాణ్యతలో జరిగిన లోపాలపై వస్తున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం ఎందుకు దాటవేస్తోంది?, ప్రాజెక్టుల భద్రత, ప్రజల ప్రాణాల కంటే మీ రాజకీయ లబ్ధే ముఖ్యమా?, గోదావరి వరదలు తెచ్చిన కష్టాలను కూడా రాజకీయ ప్రచారానికి వాడుకోవడం రైతుల పట్ల బాధ్యతాయుతమైన చర్యేనా?, పదేళ్ల పాలనలో నెరవేర్చని హామీలపై ప్రజలకు ఎప్పుడు వివరిస్తారు? అని వరుసగా నిలదీశారు.
తమ స్వార్థం కోసం మేడిగడ్డ ప్రాజెక్టును దెబ్బతీసిన వారే ఈరోజు అదే మేడిగడ్డపై నీతులు చెప్పడానికి ముందుకు రావడం చరిత్రను మర్చిపోవడమేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకుని, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతాంగ శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న శాస్త్రీయ నిర్ణయాలకు సహకరించాలని హితవు పలికారు.





