కాలుష్య రహిత రాష్ట్రంగా ఏపీ :ముఖ్యమంత్రి చంద్రబాబు

Must read

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రతో పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు అన్నారు. ఇంటి నుంచే చెత్త రాకుండా నెట్ జీరో విధానాన్ని అలవాటు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కార్బన్ న్యూట్రల్ జీవన విధానం అవలంబించాలని, ఇంటిపై పడే వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించిన 18వ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని 120 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రూ.15,274 కోట్ల విలువైన ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజినీరింగ్ పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ప్రజా వేదిక సమీపంలో ఆన్‌లైన్ వర్క్స్ మానిటరింగ్ సిస్టమ్‌ను పరిశీలించారు. మెప్మా మహిళా సంఘాలు తయారు చేసి ప్రదర్శించిన ఉత్పత్తులను తిలకించారు. నెల్లూరు, కొండపల్లి, బేతంచర్ల, కమలాపురం, బద్వేల్, ఏలేశ్వరం, నర్సీపట్నం, పెద్దాపురంలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించారు. ఉయ్యూరు, కుప్పం, నిడుదవోలు, బాపిరాజు, మదనపల్లి, విజయనగరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ, నెల్లూరు కార్పొరేషన్లకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డులు అందించిన సీఎం…ఆపరేషన్ క్లీన్ స్వీప్‌పై కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు.

రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నానని, ఈసారి 18వ కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గుడివాడ దివంగత ఎన్టీఆర్ తొలిసారి ప్రజాక్షేత్రంలో నిలబడిన ప్రాంతమని గుర్తు చేశారు. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన ప్రజాప్రతినిధులు, స్వాభిమానం అనే లక్ష్యాలతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని చెప్పారు.

‘పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు ఊడ్చడం మాత్రమే కాదని, పర్యావరణం, ప్రజారోగ్యం మెరుగు పడటమే అసలు లక్ష్యం. గత పాలనలో చెత్తతో నిండిపోయిన ప్రాంతాలను ఇప్పుడు పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నాం. పచ్చదనం, పరిశుభ్రతతోనే స్వర్ణాంధ్ర నిర్మాణం పూర్తి అవుతంది. గతంలో జన్మభూమి కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు స్పందించిన స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి ద్వారా సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్య వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం అన్నారు.

ఇంటింటికీ చెత్త సేకరణ కోసం 126 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించామని, త్వరలో మరో 1104 ఇ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రూ.528 కోట్లతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో 8 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఇంట్లో వ్యర్థాల వర్గీకరణ ప్రారంభించాలని ప్రజలను కోరిన సీఎం, స్వచ్ఛ రథం ద్వారా వ్యర్థాల సేకరణ చేస్తూ రూ.16 కోట్ల విలువైన నిత్యావసర సరుకులు అందించామని తెలిపారు. గత పాలకులు రోడ్లపై పేరుకుపోయేలా వదిలేసిన చెత్త కారణంగా భూగర్భజలాలు కలుషితమయ్యాయని, వారు వదిలేసిన 140 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రాన్ని చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ పథం, ఆపరేషన్ క్లీన్ స్వీప్ వంటి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.

‘12 ఏళ్ల క్రితం కృష్ణా డెల్టాకు నీటి ప్రవాహాలు తగ్గిపోవడంతో దేశానికి అన్నపూర్ణగా పేరొందిన ఈ ప్రాంతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అందుకే 12 నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించాం. ఈసారి 48 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు రాకున్నా పట్టిసీమ ద్వారా డెల్టాకు నీరు అందిస్తున్నాం. ఇప్పటివరకు 450 టీఎంసీల నీటిని తరలించి దాదాపు రూ.50 వేల కోట్ల సంపదను సృష్టించాము.

నీరు లేకుంటే అక్వా పరిశ్రమ ఉండదని, ప్రస్తుతం రొయ్యల ధరలు, మేత ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఇప్పటికే కేంద్రంతో చర్చించామని సీఎం అన్నారు. ఈ ప్రాంత అక్వా పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడతామని, రూ.1.50 యూనిట్ చొప్పున విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలు కఠినమవుతున్న నేపథ్యంలో ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22 నుంచి 24 తేదీల మధ్య “తల్లికి వందనం” పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా పేదల పక్షాన నిలిచే మనసుందని, తల్లికి వందనం కింద 67,47,197 మంది విద్యార్థులకు సంబంధించి రూ.10,122 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.

గత పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితి లేదని సీఎం విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు రాజకీయ చెత్తను శుభ్రం చేశారని, బూతులు తిట్టిన వారి నోళ్లను ఓట్లతో కడిగేశారని వ్యాఖ్యానించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులను కూడా బదిలీ చేసినట్టు తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకునేందుకు వీల్లేదని, తప్పు చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వారైనా ప్రభుత్వం ఒకే విధంగా వ్యవహరిస్తుందని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!