తెలంగాణ యువతను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక డెత్ డిక్లరేషనే మిగిలిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదికపైనే.. తెలంగాణ యువత కాంగ్రెస్కు ‘డెత్ డిక్లరేషన్ రాస్తుందన్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఏ సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘యూత్ డిక్లరేషన్’ బురిడీ పత్రాన్ని ఆవిష్కరించిందో, అదే వేదికపై ఇవాళ తెలంగాణ నిరుద్యోగ యువత కాంగ్రెస్ మోసాలను గ్రహించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. మాట తప్పి, నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే గడ్డపై నుంచి యువత ‘డెత్ డిక్లరేషన్’ (రాజకీయ మరణ శాసనం) రాయడానికి సిద్ధంగా ఉందని కేటీఆర్ హెచ్చరించారు.
మాయమాటలతో యువతను మోసం చేస్తామంటే కుదరదు అని…నిరుద్యోగుల ఉడుకు నెత్తురు, ఉరకలెత్తే ఆశయాల ముందు దగాకోరు రేవంత్ ప్రభుత్వం మోకరిల్లక తప్పదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ యువతను జిత్తులమారి ముసలి నక్కలా కాంగ్రెస్ పార్టీ తెలివిగా చిత్తు చేసిందన్నారు. ఇవాళ సరూర్ నగర్ లో జరిగిన యువసంగ్రామం సదస్సులో మాట్లాడిన కేటీఆర్, 60 ఏళ్లు తెలంగాణ నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్.. కొత్త డూప్లికేట్ రూపాల్లో వచ్చి నకిలీ ప్రేమను కురిపించి యువతను బలిపీఠం ఎక్కించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ పెద్ద మోసం అన్న కేటీఆర్, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఓ బురిడీ పత్రాన్ని విడుదల చేశారని మండిపడ్డారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ కు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక లు చేసిన మోసాన్ని యువత మార్చిపోదన్న కేటీఆర్, గుర్తుపెట్టుకుని కచ్చితంగా గుణపాఠం చెపుతుందన్నారు.
రాహుల్ గాంధీ ప్రచారం చేసుకునే ‘మొహబ్బత్ కీ దుకాన్’ (ప్రేమ దుకాణం) తెలంగాణ యువత పాలిట ‘గద్దారీ కా మకాన్’ (ద్రోహుల ఇల్లు) గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సరూర్ నగర్ యువ సంగ్రామం సదస్సులో మాట్లాడిన కేటీఆర్, రాహుల్ కు తెలుగు రాదు కాబట్టి, తెలంగాణ యువత పడుతున్న వేదనను ఆయనకు అర్థమయ్యే భాషలోనే చెపుతానంటూ హిందీలో మాట్లాడారు. మూడేళ్ల క్రితం అశోక్ నగర్ చౌరస్తాలో ఛాయ్ తాగుతూ నిరుద్యోగులతో దిగిన ఫోటోలు, ఇచ్చిన జూటా హామీలు గుర్తున్నాయా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. “రాహుల్ గాంధీ గారూ.. మీకు తెలుగు రాదు, ఇక్కడి తెలంగాణ యువత పడుతున్న ఆవేదన, బాధ అస్సలు అర్థం కాదు. అందుకే మీకు బాగా అర్థమయ్యే మీ హిందీ భాషలోనే అడుగుతున్నా” అన్నారు.
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ‘యూత్ డిక్లరేషన్’ హామీల పరిస్థితి ఏమైందని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. జాబ్ క్యాలెండర్ తో పాటు 4,000 నిరుద్యోగ భృతి ఏదని ప్రశ్నించారు. లక్షలాది మంది అభ్యర్థులు కొలువుల కోసం రోడ్లపైకి వస్తుంటే, ఈ ప్రభుత్వం ఉద్యోగాల ‘నోటిఫికేషన్’ ఇవ్వడం పక్కనబెట్టి, కేవలం ‘లూటీఫికేషన్’ (దోపిడీ) లో మునిగిపోయిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి, కాలేజీ అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు అంటూ కాంగ్రెస్ ఇచ్చిన 24 హామీలలో ఒక్కటైనా నెరవేరిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ‘ఓటు కొట్టు.. జాబ్ పట్టు’ అని పత్రికల మొదటి పేజీల్లో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్, నేడు ఏడాది దాటినా జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు అక్రమాలు చేసినా తాను నేపాల్ మాదిరి ఒక విద్వంసానికి పిలుపు ఇవ్వడం లేదు అని, కేవలం ప్రజాస్వామికంగా కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ వారి పైన పోరాటం చేయాలని మాత్రమే పిలుపునిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. కేవలం విద్యార్థులను కేసుల్లో ఇరికిచ్చి రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఏనాడు ఆలోచించదు అన్నారు.
ఒకవైపు తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూనే భవిష్యత్తును నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ తో పాటు జాబ్ క్యాలెండర్ల వంటి అన్ని అంశాల్లో యువతకు సంబంధించి అన్ని ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని ఒక అన్నగా ముందుకు పోతామని వారి వెంట నిలుస్తానని భరోసా ఇచ్చారు. మరోవైపు టి హబ్ స్టార్టప్ అయిన స్కైరూట్ సంస్థ ఈ రోజు ప్రయోగించిన మొదటి రాకెట్ ప్రయోగానికి సంబంధించిన విజయాన్ని అందరూ అభినందించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరుద్యోగ యువత కాంగ్రెస్ తమకు చేసిన ద్రోహాన్ని వివరించారు. ఇక ఈ సదస్సుకు హాజరైన బీఆర్ఎస్ సీనియన్ నేతలు సభాప్రాంగణం చివరలో కూర్చుని, ముందు వరుసల్లో యువతను కూర్చోబెట్టడం పలువురిని ఆకర్షించింది.





