త్రాగిస్తే .. తచ్చాడుతా, తాళాలకు తందనాలాడుతా;
తినిపిస్తే .. తిరుగుతా, తృప్తిని పొందుతా॥
పలకరిస్తే .. పలవరింతలై వికసిస్తా, పండుగవుతా;
పరవశపరిస్తే.. పట్టరాని తన్మయత్వంలో మునిగిపోతా॥
చూపిస్తే.. వెన్నెలై విరిసిపోతా, విస్మయమవుతా;
వినిపిస్తే.. వీణారాగమై విహరిస్తా, తన్మయుడనవుతా॥
ఆడిస్తే.. ఆనందిస్తా, ఆకట్టుకుంటా;
గెలిపిస్తే.. గంతులేస్తా, కీర్తిపతాకం ఎగరేస్తా॥
పాడిస్తే .. పంచమమవుతా, పాటలో ప్రాణమవుతా;
పొంగిస్తే.. పుష్కలానందమై పొంగిపోతా॥
ప్రేమిస్తే.. ప్రాణదీపమవుతా, ప్రణయసాగరంలో ఈదుతా;
పెళ్లిచేస్తే.. పాణిగ్రహణ బంధమవుతా, పరిపూర్ణ జీవితం గడుపుతా॥
రాయిస్తే .. రత్నాల్లాంటి భావాలు చిందిస్తా, రసవర్షమవుతా;
గీయిస్తే.. గవాక్షాలు తెరుస్తా, గీతల్లో గుండెచప్పుళ్లు నింపుతా॥
పొగిడితే.. పున్నమి చంద్రుడిలా ప్రకాశిస్తా, పుష్పంలా వికసిస్తా;
ప్రోత్సహిస్తే.. ప్రతిభను చాటుతా, ప్రగతి శిఖరాలెక్కుతా॥
నమ్మితే .. నింగంత విశ్వాసమై నిలుస్తా, నీడవుతా;
నడిపిస్తే.. నవ్యబాటల్లో పయనిస్తా, ఫలసిద్ధి పొందుతా॥
ఆదరిస్తే.. ఆత్మీయతై అల్లుకుపోతా, ఆనందమై నిలుస్తా;
ఆశీర్వదిస్తే.. అక్షరాల్లో చిరంజీవినై, అందరి హృదయాల్లో నిలిచిపోతా॥
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.





