అభివృద్ధి చెందిన భారత్–2047 లక్ష్య సాధనలో యువ ఇంజినీర్లు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి కల్పించే వారిగా, సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపే ఆవిష్కర్తలుగా ఎదగాలని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.
గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) 6వ స్నాతకోత్సవానికి తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు . 2026 సంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులందరికీ గవర్నర్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గవర్నర్ అధ్యాపకులు , విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు .
స్నాతకోత్సవం అంటే డిగ్రీలు అందజేయడం మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు నిర్మాణ బాధ్యతలను యువతకు అప్పగించే పవిత్ర ఘట్టమని పేర్కొన్నారు.
తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి సాంకేతికత, పరిశోధన, స్టార్టప్‌లు, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా ఎదిగిందని గవర్నర్ అన్నారు. ఐటీ, ఏరోస్పేస్, బయో-ఫార్మా వంటి రంగాల్లో యువతకు అపార అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు సరైన సమయంలో సరైన ప్రదేశం నుంచి పట్టభద్రులవుతున్నారని తెలిపారు.
కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధన, హరిత శక్తి వంటి రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతోందని, ఉన్నత జ్ఞానంతో పాటు విలువలు, నైతికత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వమే నిజమైన విద్య ఫలితమని ఆయన అన్నారు.
యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి “నశాముక్త్ భారత్” నిర్మాణానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని గవర్నర్ పిలుపునిచ్చారు. జీవితాంతం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని, అపజయాలను విజయానికి మెట్టుగా భావించాలని, తల్లిదండ్రులు, గురువుల త్యాగాలను గౌరవిస్తూ సమాజానికి సేవ చేయాలని సూచించారు.
భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం కేవలం ప్రభుత్వాల కృషితోనే సాధ్యం కాదని, యువత భాగస్వామ్యం అత్యంత అవసరమని గవర్నర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ పట్టభద్రులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మలచాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగాల కోసం మాత్రమే ఆలోచించే ధోరణి నుంచి బయటకు వచ్చి, స్టార్టప్‌లు స్థాపించి మరెందరికో ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. నేటి ప్రపంచంలో సృజనాత్మక ఆలోచనలు, వినూత్న సాంకేతిక పరిష్కారాలు, నాయకత్వ లక్షణాలు ఉన్న యువతకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇంజినీర్లు సమస్యలను గుర్తించి వాటికి సాంకేతిక పరిష్కారాలను రూపొందించడం ద్వారా సమాజ అభివృద్ధికి విశేషంగా దోహదపడగలరని ఆయన అన్నారు.
పట్టభద్రులకు ప్రసంగిస్తూ, విజయం అనేది కేవలం ఉన్నత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని పొందడంలోనే లేదని, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడం, కొత్త అవకాశాలను సృష్టించడం, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంలోనూ ఉందని పేర్కొన్నారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించవచ్చని సూచించారు.
స్నాతకోత్సవంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ స్వర్ణ పతకాలు, డిగ్రీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో తమ విద్యాసంస్థకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సీబీఐటీ యాజమాన్యం, పాలక మండలి సభ్యులు, అధ్యాపకులు, పరిశ్రమల ప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళాశాల విద్యా ప్రగతి, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమలతో భాగస్వామ్యాలు, విద్యార్థుల ఉపాధి అవకాశాలపై యాజమాన్యం వివరాలను వెల్లడించింది. విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు సంస్థ తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు.





