ఒకరోజు పోలీసింగ్ ఆపవచ్చేమో… క్రీడలు ఆడటం ఎప్పటికీ ఆపను” –డీజీపీ సి.వి. ఆనంద్

Must read

తెలంగాణ పోలీసు శాఖలో శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, క్రీడా ప్రతిభను మరింత ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, ఐపీఎస్ బుధవారం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు.

తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల ద్వారా పోలీసు సిబ్బందిలో ఫిట్‌నెస్‌ను పెంపొందించడంతో పాటు, రాష్ట్రం మరియు దేశానికి ప్రాతినిధ్యం వహించే అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ, జాతీయ స్థాయి పతక విజేత ఆర్‌ఎస్‌ఐ గోవిందరెడ్డికి స్పోర్ట్స్ టార్చ్‌ను అందజేశారు. అనంతరం శాంతి, ఐక్యత, క్రీడా స్ఫూర్తికి ప్రతీకగా తెల్లపావురాలు, రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి విడుదల చేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, ఐపీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలకు తమ కమిషనరేట్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. పోలీసింగ్‌లో క్రమశిక్షణ, అంకితభావం, జట్టు భావన, క్రీడా స్ఫూర్తి ఎంతో కీలకమని పేర్కొంటూ, ఈ పోటీలు పోలీసు సిబ్బందిలో పరస్పర సహకారం, శారీరక సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సభను ఉద్దేశించి డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా రాష్ట్ర పోలీస్ క్రీడలు ఒకే వేదికపై నిర్వహించేవారని, ఈసారి తొలిసారిగా ఐదు క్లస్టర్లుగా విభజించి 21 జట్లతో, 34 ఈవెంట్స్ లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు తరహాలో వివిధ సమయాల్లో వివిధ ప్రాంతాల్లో, వివిధ క్రీడలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే విధంగా సన్నదo చేస్తున్నామన్నారు.

ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది పోలీసు అధికారులు, సిబ్బందికి పాల్గొనే అవకాశం లభిస్తుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి అఖిల భారత పోలీస్ క్రీడలు, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం సులభమవుతుందని పేర్కొన్నారు.

అఖిల భారత పోలీస్ గేమ్స్ తరహాలో శాస్త్రీయ ప్రణాళికతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని, ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ, కోచింగ్, ఫిట్‌నెస్ నిర్వహణ సదుపాయాలు కల్పించి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు.

గత సంవత్సరo అఖిల భారత పోలీస్ క్రీడల్లో తెలంగాణ పోలీస్ బృందం 21 పతకాలు సాధించిందని గుర్తు చేస్తూ, రాబోయే పోటీల్లో బంగారు పతకాల సంఖ్యను మరింత పెంచేలా కృషి చేస్తామని తెలిపారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా డీజీపీ వివరించారు.

  • బంగారు పతకం సాధించిన వారికి రూ.3 లక్షల నగదు బహుమతి, మూడు ప్రత్యేక ఇంక్రిమెంట్లు.
  • వెండి పతకం సాధించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి, రెండు ప్రత్యేక ఇంక్రిమెంట్లు.
  • కాంస్య పతకం సాధించిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి, ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్.

ప్రతి యూనిట్‌లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని, క్రీడలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమయ వృథాగా భావించవద్దని ఉన్నతాధికారులకు సూచించారు.తనకు గోల్ఫ్ ఆడటం ధ్యానం చేసినంత ప్రశాంతతను ఇస్తుందని, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా క్రీడలు తనకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలిపారు. “నేను ఒకరోజు పోలీసింగ్‌ను ఆపవచ్చేమో… కానీ క్రీడలు ఆడటం మాత్రం ఎప్పటికీ ఆపను” అని చేసిన వ్యాఖ్యలు సభలో చప్పట్లతో మార్మోగాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!