హైదరాబాద్‌లోనే ఓటు నమోదు చేసుకోండి: కిషన్ రెడ్డి

Must read

హైదరాబాద్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కును హైదరాబాద్‌లోనే నమోదు చేసుకుని ఇక్కడే వినియోగించుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తూ, ఇక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ, ఆస్తులు కలిగి ఉన్నవారు తమ ఓటు కూడా నగరంలోనే ఉండేలా చూసుకోవాలని ఆయన కోరారు.

హైదరాబాద్‌లో లక్షలాది మంది ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వారి పిల్లలు కూడా నగరంలోనే చదువుకుంటున్నందున నగర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో వారు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడే జీవనం సాగిస్తున్న వారు ఓటును కూడా హైదరాబాద్‌లోనే నమోదు చేసుకుని ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో ఓట్లు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు, భూములకు సంబంధించిన ప్రయోజనాలు కోల్పోతారని ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు.

ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ఎక్కడ నమోదు చేసుకోవాలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక ప్రాంతంలో ఓటు నమోదు చేసుకున్నందుకు మరొక ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు కోల్పోయే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.

అవసరమైతే భవిష్యత్తులో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటును తిరిగి స్వగ్రామానికి మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఓటును కొనసాగించి నగర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ అభివృద్ధి, నగర భవిష్యత్తు, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలో నివసిస్తున్న వారందరూ ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, తద్వారా హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!